నైని బ్లాక్ కేసు ద్వారా కాంగ్రెస్ పాలనలో టెండర్లు అభివృద్ధి కోసం కాకుండా కేవలం కమీషన్ల కోసమే జరుగుతున్నాయన్న నిజం బయటపడిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు విమర్శించారు. సింగరేణి, నైని బ్లాక్, కోల్ టెండర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకుల సొంత మనుషులు, బంధుమిత్రులకే కోల్ బ్లాక్స్, కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ విషయమై బీఆర్ఎస్ నాయకులు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే నైతిక హక్కు వారికి లేదని ఆయన స్పష్టం చేశారు. సింగరేణిలో జరిగిన కుంభకోణాల్లో సగం పాపం గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిదైతే, మిగతా సగం పాపం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తెలిపారు. కార్మికుల రక్తం, చెమటతో లాభాల్లో నడిచిన సింగరేణిని పక్కన పెట్టి, ఈరోజు అదే సింగరేణి పేరుతో వ్యాపారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.
దేశంలోనే అత్యంత లాభాల్లో ఉన్న సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణిని ఈరోజు నష్టాల్లో ఉందని చెప్పడం దారుణం అంటూ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.50 వేల కోట్లకు పైగా బకాయిపడి ఉందని చెప్పారు. నష్టాల్లో ఉందని చెబుతున్న సింగరేణి నుంచి మెస్సీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో రూ.10 కోట్ల స్పాన్సర్‌షిప్ ఎలా ఇచ్చారని పేర్కొంటూ నష్టాల్లో ఉన్న సంస్థతో ఇంత భారీ ఖర్చులు ఎలా పెట్టారు? అని రావు ప్రశ్నించారు
‘సైట్ విజిట్’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చి, ఆ విధానం పేరుతో అక్కడికి వెళ్లి తమకు సంబంధించిన వారికే టెండర్లు ఇవ్వాలనే కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన గుర్తు చేశారు. నైని బ్లాక్ టెండర్లను ఎందుకు రద్దు చేశారో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరికి ఎంత ముడుపులు పుట్టాయి? ప్రజలకు సమాధానం రావాల్సిందే అని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్పొరేట్ కంపెనీల విషయంలో మంత్రుల మధ్యే విభేదాలు బయటపడ్డాయని పేర్కొంటూ ఒక మంత్రి, ఒక పీఏ కలిసి సిమెంట్ కంపెనీని బెదిరించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయని, మరో మంత్రి “ఆ వ్యవహారంలోకి రావద్దు” అని చెప్పిన పరిస్థితులు ఉన్నాయని రామచందర్ రావు గుర్తు చేశారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మధ్య కూడా టెండర్లు ఎవరి మనుషులకు ఇవ్వాలి? అన్న గొడవలు బహిర్గతమయ్యాయని, ఇది కాంగ్రెస్ పాలనలోని అసలైన పరిపాలనా పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిపాలనపై కాదు, కేవలం కమీషన్లపైనే దృష్టి పెట్టిందని మండిపడ్డారు. ఈ రోజు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పూర్తిగా పక్కన పెట్టిందని చెబుతూ రాష్ట్రంలో నిజంగా పాలన జరుగుతోందా? లేక మంత్రుల మధ్య ఎవరు ఎంత పంచుకుంటున్నారు?
ఎవరు ఎక్కువ తీసుకున్నారు? ఎవరి కుటుంబానికి ఎంత దక్కింది? అన్న గొడవలే కొనసాగుతున్నాయా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. సీబీఐ అయినా, సిట్ అయినా, విజిలెన్స్ అయినా.. ఏ దర్యాప్తు సంస్థ అయినా సరే, సింగరేణిని బీఆర్ఎస్ తమ సొంత ఆస్తిలా వాడుకున్న కాలం నుంచి, ఈ రోజు కాంగ్రెస్ మంత్రులు “మా వాళ్లకే కాంట్రాక్టులు ఇవ్వాలి” అని కొట్లాడుకునే స్థాయి వరకూ సమగ్ర దర్యాప్తు జరిపించాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు.

More Stories
నితిన్ నబిన్ ఎన్నికతో బీజేపీలో యువ నాయకత్వం జోరు
బంగ్లాదేశ్ లో దౌత్య సిబ్బంది కుటుంభం సభ్యుల తరలింపు!
పెండింగ్ చలాన్ల కోసం కీస్ తీసుకోవద్దు, బైక్ లాక్కోవద్దు