పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, రోడ్డు మీదనే వాహనాన్ని ఆపేయడం లాంటి పనులు చేయొద్దని తెలిపింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది.
వాహనదారులు చలాన్ చెల్లించడానికి ఇష్టపడని పక్షంలో చట్టప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా వాహనాలపై ఉన్న ఈ చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను రోడ్డు మీదనే ఇబ్బంది పెడుతున్నారని, బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు కోర్టు అలా చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
వాహనాల చలానాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. రవాణా శాఖ నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ వాహనంపై చలాన్ పడిన వెంటనే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యేలా చేయాలని చెప్పడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, రహదారి భద్రతపై పాఠశాల స్థాయిలో పిల్లలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్‌తో ఒప్పందం, కమాండ్ కంట్రోల్ వంటి వ్యవస్థలున్నాయని తెలిపారు. మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని సూచించారు. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించి క్రమశిక్షణ గల అధికారులకు బాధ్యతలు అప్పగించాలని పోలీసులకు సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ అనే ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని ఇటీవల డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ఇందులో పోలీసులు, రవాణా శాఖ పని మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గతేడాది రోడ్డు ప్రమాదాలు పెరిగినా విస్తృతంగా అవగాహన కల్పించడంతో మరణాల సంఖ్య కొంతవరకు తగ్గిందని చెప్పారు. అందరూ కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

More Stories
సింగరేణి టెండర్ల రద్దు కాంగ్రెస్ దోపిడీ పాలనకు నిదర్శనం
వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 చారిత్రాత్మక సంస్కరణ
అట్టహాసంగా ప్రారంభమైన మేడారం జాతర