పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) లోగో కలిగిన విమానం ఆకారపు బెలూన్ హిమాచల్ ప్రదేశ్ లో కలకలం రేపింది. కులు జిల్లా బష్లా గ్రామంలోని ఓ రైతు పొలంలో పాకిస్థాన్ విమానయాన గుర్తుతో ఒక అనుమానాస్పద బెలూన్ కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడకి చేరుకుని ఆ బెలూన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బష్లా గ్రామంలోని రజనీ అనే మహిళా రైతు తన పొలంలో బెలూన్ ను మొదటగా చూశారు. దీనిని చూసి భయపడిన ఆమె గ్రామ సర్పంచ్ జోగింద్ర ఠాకూర్ కు సమాచారమిచ్చారు. దీంతో ఆయన ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో, వారు దాన్ని ఎవరూ తాకవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బెలూన్ను స్వాధీనం చేసుకుని దానిపై విచారణ చేపట్టారు.
ఆ బెలూన్ ను పరిశీలించిన పోలీసులు దానిపై ‘పీఐఏ’ లోగోతో పాటు ఉర్దూ, ఇంగ్లీష్ లో ‘ఎస్జీఏ’ అని రాసి ఉన్నట్లు వివరించారు. అయితే, ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదని, గత కొన్నేళ్లుగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ లోగోతో ఉన్న బెలూన్లు లభించాయని పోలీసులు వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకూ ఆ బెలూన్లు ఎలా వస్తున్నాయి? వాటి వెనుక ఉన్న ఉద్ధేశమేంటి? అనేది తెలియడం లేదని చెబుతున్నారు.
దీనిపై కులు సూపరింటెండెంట్ మదన్ లాల్ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ “మేము స్వాధీనం చేసుకున్న బెలూన్ పై ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఎలాంటి చిప్ గాని, గూఢచారానికి సంబంధించిన ఇతర అనుమానాస్పద పరికరాలు ఆ బెలూన్ లో లభించలేదు. దీని గురించి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం” అని చెప్పారు.
అంతకుముందు ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్న 15 ఏళ్ల బాలుడిని పఠాన్‌కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌కు చెందిన మైనర్లతో గూఢచర్యం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఐఎస్‌ఐ ఏజెంట్లు కుట్ర పన్నినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్, పంజాబ్, హరియాణాకు చెందిన పలువురు మైనర్లను ట్రాప్ చేసి, ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా వారు ప్రేరేపిస్తున్నారని వివరించారు.
ఇప్పటివరకు హరియాణా, పంజాబ్‌కు చెందిన 12 మంది, జమ్మూకశ్మీర్‌కు చెందిన 25 మంది మైనర్లను ఐఎస్‌ఐ ఏజెంట్లు ట్రాప్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. వారి కదలికలపై దర్యాప్తు బృందాలు నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. వీరంతా 14 నుంచి 17 ఏళ్లలోపు వారేనని తెలిపారు.

More Stories
మేలోనే ‘సముద్రయాన్’ ‘మత్స్య-6000’ ప్రయాణం
పంజాబ్ కేసరి వార్తాపత్రిక ప్రచురణకు సుప్రీం అనుమతి
యూనివర్సిటీల్లో 118 శాతం పెరిగిన కులవివక్షఫిర్యాదులు