బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్

బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్
*తొలిసారి బంగాల్‌, తెలంగాణలో కూడా అధికారంలోకి.. మోదీ ధీమా 
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నితిన్ నబీన్​ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తూ పార్టీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లక్ష్మణ్ ధ్రువపత్రాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం కమల దళపతిగా నబీన్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ సహా పలువురు కేంద్రమంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ఎంపీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు.
 
ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా, నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. నబిన్‌ను అధ్యక్ష కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నూతన అధ్యక్షుడిని ఆలింగనం చేసుకుని అభినందించారు. పార్టీ అగ్రనేతలంతా వేదికపై నిలిచి సంఘీభావం తెలిపారు. సంస్థ తనపై ఉంచిన బాధ్యతకు తాను ఎంతగానో వినమ్రతతో ఉన్నానని నబిన్ తెలిపారు. 
“అన్నింటికంటే ముందుగా, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా లాంటి ఒక సాధారణ కార్యకర్తకు పార్టీలో ఈ అత్యున్నత స్థానానికి చేరుకునే అవకాశాన్ని మీరు కల్పించారు, ఇందుకోసం మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను,” అని ఆయన పేర్కొన్నారు.

బాధ్యతలు అప్పగిస్తూ జేపీ నడ్డా “నితిన్ నబీన్ నాయకత్వంలో, మోదీ మార్గదర్శకత్వంలో రాబోయే రోజుల్లో బంగాల్‌లో కమలం వికసిస్తుంది. పుదుచ్చేరి, తమిళనాడులో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అసోంలో మళ్లీ అధికారంలోకి వస్తాం. కేరళలోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. మనం ఇంకా విజయం సాధించని కొత్త ప్రదేశాల్లో జెండా పాతాలి” అని ధీమా వ్యక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీ చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. తొలిసారి బంగాల్‌, తెలంగాణలో కూడా అధికారంలోకి రానున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీది మాత్రం ఎల్లప్పుడూ అభివృద్ధి మోడల్‌ అంటూ చెప్పుకొచ్చారు.

బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాగలరని ప్రధాని మోదీ తెలిపారు. పార్టీ నిర్ణయాలు, ఎంపిక అన్నీ ప్రజాసామ్యయుతంగా ఉంటాయని చెప్పారు. దేశ సేవ, ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని, కార్యకర్త కేంద్రంగా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయని తెలిపారు. బీజేపీ కార్యకర్త అని అనిపించుకోవడమే తన గర్వకారణంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.

“బీజేపీలో ప్రత్యేకంగా పదవులు, బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త స్వయంగా బాధ్యతలు తీసుకోవాలి. పార్టీ కోసం కృషి చేయాలి. కొత్తగా వస్తున్న మార్పులను పార్టీ అందిపుచ్చుకోవాలి, అనుసరించాలి. రేడియో నుంచి ఏఐ పరిజ్ఞానం వరకు అన్నింటినీ ఉపయోగించుకోవాలి” అని ప్రధాని సూచించారు.  “పార్టీ బాధ్యతలను జీవనశైలిగా భావించాలి. బాధ్యతలు ఒకరి నుంచి ఒకరికి మారుతాయి, లక్ష్యం మారదు. నాయకత్వం మారినా మన గమ్యం మారొద్దు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలి” అంటూ మోదీ పిలుపునిచ్చారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా తాను అభివర్ణించిన బీజేపీకి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నితిన్ నబీన్‌కు అభినందనలు తెలిపారు మోదీ. ఆయన బాధ్యత కేవలం బీజేపీని నిర్వహించడంతోనే ముగిసిపోదని చెప్పారు. “పార్టీ విషయానికి వస్తే, నితిన్ బాస్, నేను ఒక పార్టీ కార్యకర్తను. ఇప్పుడు గౌరవనీయులైన నితిన్ నబీన్ జీ మనందరికీ అధ్యక్షుడు. ఆయన బాధ్యత కేవలం బీజేపీని నిర్వహించడం మాత్రమే కాదు, ఎన్డీఏ మిత్రపక్షాలన్నింటి మధ్య సమన్వయం ఉండేలా చూడటం కూడా” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

రాబోయే దశాబ్దాల ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతూ, ప్రధాని మోదీ, “రాబోయే 25 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలోనే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాల్సి ఉంది. అది జరగడం ఖాయం” అని తెలిపారు.  నితిన్ పార్టీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నితిన్ నబీన్​లో ఉన్న యువశక్తి, అనుభవం పార్టీకి పనికొస్తుందని చెప్పారు. 45 ఏళ్ల నబిన్ ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో పెద్ద మార్పులను చూసిన తరానికి చెందినవారని తెలిపారు.