ఆఫీసు వేళల్లో ఆయన రాసలీలలు ఆడడం అభ్యంతరకరంగా మారింది. డీజీపీ ఆఫీసులోనే ఆ వీడియోను చాలా సీక్రెట్‌గా రికార్డింగ్ చేశారు. కనీసం అయిదారు నెలల క్రితం ఆ వీడియో తీసినట్లు అనుమానిస్తున్నారు. యూనిఫాంలో విధుల్లో ఉండగానే, ప్రభుత్వ కార్యాలయంలోనే అభ్యంతరకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రారావు వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై దర్యాప్తు చేసి, పూర్తి వివరాలు తెలియజేయాలని సంబంధిత శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. “ఈ విషయం నాకు ఈరోజు ఉదయమే తెలిసింది. దీనిపై వెంటనే చట్టప్రకారం క్రమశిక్షణ చర్యలకు ఆదేశించా. ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా చట్టానికి అతీతులు కాదు.” అని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలపై దర్యాప్తు కొనసాగుతోందని, అవి నిజమని తేలితే సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. రాసలీలలకు సంబంధించిన ఈ ఘటనపై ఎక్కడా ఫిర్యాదు నమోదు కాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి.
మహిళలపై ఎలాంటి బలవంతం జరిగినట్లు ఆరోపణలు లేకపోయినప్పటికీ.. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆఫీసులో ఇలా ప్రవర్తించడం పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చేలా ఉందనే విమర్శలు నెట్టింట వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ వీడియో తనది కాదని, లాయర్‌ను కలుస్తానని డీజీపీ రామచంద్ర రావు కొట్టిపారేశారు. అది మార్ఫింగ్ చేసిన వీడియో అని, తనను టార్గెట్ చేశారని అంటున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో హోంమంత్రి జీ పరమేశ్వరతో చర్చించేందుకు ఆయన నివాసానికి రామచంద్రరావు రాగా, ఆయన సమయం కేటాయించకపోవడంతో సమావేశం కాకుండానే వెనుదిరిగారు. ఈ క్రమంలోనే హోం మంత్రి నివాసం బయట మీడియాతో మాట్లాడారు. “హోం మంత్రి పరమేశ్వరను కలిసి నాపై తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చాను. ఈ వీడియో 8ఏళ్ల క్రితం బెళగావిలో ఉన్నప్పటిది. ఇది నన్ను షాక్‌కు గురిచేసింది. మా న్యాయవాదులతో మాట్లాడి దీనిపై చర్యలు తీసుకుంటాం. ఇదంతా కల్పితం, ఈ వీడియో గురించి నాకు ఏం తెలియదు. ” అని తెలిపారు.
కాగా గతేడాది బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు రామచంద్రరావు సవతి తండ్రి. అప్పట్లో బంగారం అక్రమ రవాణా కేసులో ఆయన పేరు వాడుకునే విమానాశ్రయాల్లో రన్యారావు భద్రతా తనిఖీలను తప్పించుకునేదని ఆరోపణలు వచ్చాయి. గోల్డ్ స్మిగ్లింగ్ కేసు సమయంలో రామచంద్రరావును బలవంతంగా సెలవుపై పంపారు. కేసు దర్యాప్తులో పారదర్శకత కోసం ఆ చర్య తీసుకున్నట్లు అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. 2025 ఆగస్టులో ప్రభుత్వం ఆ సెలవును ఉపసంహరించుకుకొని, మళ్లీ డీజీపీగా నియమించింది. ఆయన ఈ ఏడాది మేలో పదవీ విరమణ పొందనున్నారు.
మరోవైపు ఈ ఘటనపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పందిస్తూ “తప్పు చేసిన వారు ఎవరైనా కచ్చితంగా శిక్షను అనుభవిస్తారు. మా ప్రభుత్వం చట్టం ప్రకారం ఏమి చేయాలో అది చేస్తుంది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా మహిళలపై ఏదైనా దారుణం జరిగితే, వారు తప్పు చేసి ఉంటే ఎంత పెద్ద అధికారి అయినా కఠిన చర్యలు తీసుకుంటాము.”అని స్పష్టం చేశారు.

More Stories
భారత్, యుఎఇ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు
భారత్ ను ఇరకాటంలో పడేస్తున్న ట్రంప్ గాజా శాంతి మండలి
వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 చారిత్రాత్మక సంస్కరణ