జాతీయ అధ్యక్ష పదవికి యువ నాయకులు నితిన్ నబిన్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన తరుపున ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నేతృత్వంలోని ఏపీ బిజెపి నేతలు రిటర్నింగ్ అధికారి కే లక్ష్మణ్ కు సోమవారం నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకు ముందు ఢిల్లీలోని ఆంధ్రా భవన్ లో విలేకర్ల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ప్రస్తుతం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న యువ నాయకులు నితిన్ నబిన్ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా బలపరుస్తున్నామని తెలిపారు.
కేవలం 45 ఏళ్ల వయస్సులోనే పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న నితిన్ నవీన్ నాయకత్వం పార్టీకి నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపిలో మండల, రాష్ట్ర, జాతీయ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ సంస్థగతంగా జరుగుతుందని చెప్పారు. బీహార్ కు చెందిన యువ నాయకుడు నవీన్ నబిన్ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేయటం పట్ల దేశవ్యాప్తంగా కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.
కాగా, వైసిపి పాలనలో లిక్కర్ స్కామ్ తోపాటు అనేక అరాచకాలు జరిగాయని మాధవ్ ఆరోపించారు. వైసిపి అరాచకాలు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలికితీస్తోందని చెబుతూ రాబోయే కాలంలో ఇంకా వైసీపీ అరాచకాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, శాసనమండలి పక్ష నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

More Stories
రూ. 50 కోట్లతో ఏపీ ఎన్నార్టీ కార్పస్ ఫండ్
మార్చి నెలాఖరు నుండి టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణ
శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 ఆలయాలు