ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో దోషిగా తేలి 10 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో పదేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ”శిక్ష నుండి ఉపశమనం కల్పించేందుకు ఎటువంటి కారణాలు చూపలేదు. సెంగార్ పిటిషన్ నిరాకరించబడింది” అని జస్టిస్ రవీందర్ దుడేజా పేర్కొన్నారు.
సెంగార్ చాలాకాలం జైలు శిక్ష అనుభవించినప్పటికీ, ఆలస్యం కారణంగా ఉపశమనం కల్పించలేమని జడ్జి అభిప్రాయపడ్డారు. ఆయన తాను దోషిగా నిర్థారించబడినందుకు వ్యతిరేకంగా తనఅప్పీల్‌లో పలు దరఖాస్తులను దాఖలు చేయడం కొంత కారణమని తెలిపారు. ఉన్నావ్ అత్యాచారం కేసులో కుల్దీప్ సెంగర్ దోషిగా తేలి జీవితఖైదు అనుభవిస్తున్నారు. ఇటీవల ఈ శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు షరతులపై బెయిల్ కూడా ఇచ్చింది.
అయితే ఈ తీర్పుపై సీబీఐ అధికారులు, బాధితురాలి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో శిక్ష నిలిపివేతపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కస్టడీ నుంచి విడుదల చేయవద్దని పోలీసుశాఖను ఆదేశించింది. బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో 2020 మార్చి 13న సెంగార్‌కు ట్రయల్ కోర్టు పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10లక్షల జరిమానా విధించింది. ఒక కుటుంబానికి ”ఏకైక జీవనాధారం” అయిన వ్యక్తిని చంపినందుకు ఎటువంటి దయ చూపలేమని ట్రయల్ కోర్టు పేర్కొంది.
ఇదే కేసులో సెంగార్ సోదరుడు అతుల్ సింగ్ సెంగార్‌తో పాటు మరో ఐదుగురు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. సెంగార్ ఉత్తర్వుల మేరకు ఆయుధాల చట్టం కింద ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు తీవ్రంగా హింసించడంతో 2018 ఏప్రిల్ 9న కస్టడీలోనే ఆయన మరణించారు.

More Stories
భారత్, యుఎఇ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం
రాసలీలలు వీడియోతో కర్ణాటకలో డీజీపీ స్థాయి అధికారి సస్పెండ్