స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు `సుప్రీం’ కోర్టుధిక్కార నోటీసులు

స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు `సుప్రీం’ కోర్టుధిక్కార నోటీసులు

* బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై

సుప్రీంకోర్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయలేదని పిటిషన్‌ వేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై సమాధానం చెప్పాలని స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. 

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్‌ అమలు చేయలేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్ వేశారు.  మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను కౌశిక్ రెడ్డి, కేటీఆర్ పిటిషన్లతో జత చేసిన సుప్రీంకోర్టు అన్ని పిటిషన్లపై విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.

తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), అరెకపూడి గాంధీ(శేరిలింగంపల్లి), ఎం.సంజయ్‌(జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్‌చెరు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం), కడియం శ్రీహరి(స్టేషన్‌ఘన్‌పూర్‌), దానం నాగేందర్‌(ఖైరతాబాద్‌), ప్రకాశ్‌గౌడ్‌(రాజేంద్రనగర్‌)లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, చింత ప్రభాకర్, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్​ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారించిన సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు ఒకసారి 3 నెలలు, తర్వాత మరో 4 వారాల సమయాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయనిపుణులు, అడ్వకేట్‌ జనరల్‌తో చర్చించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆ 10 మంది శాసన సభ్యులకు నోటీసులు జారీ చేశారు. 

ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ వివరణలను సభాపతి ప్రసాద్​ కుమార్​కు సమర్పించారు. తాము బీఆర్​ఎస్​ పార్టీ మారలేదని, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని వారు తమ వివరణల్లో పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో భాగంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశామని, ఈ సందర్భంగా సీఎం తమను సత్కరించడమే తప్ప తాము పార్టీ కండువా కప్పుకోలేదని వారు అఫిడవిట్‌ సైతం దాఖలు చేశారు. 

మొదటగా ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండోసారి మరో ఇద్దరికి క్లీన్‌చిట్‌ ఇచ్చిన ఆయన మరో ఎమ్మెల్యేకు సంబంధించి తీర్పు రిజర్వులో ఉంచారు.  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ అనర్హత పిటిషన్‌పై విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలకు చెందిన అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగాల్సి ఉంది.