సామూహిక అత్యాచార బాధితురాలి మృతితో మణిపూర్ లో ఉద్రిక్తత

సామూహిక అత్యాచార బాధితురాలి మృతితో మణిపూర్ లో ఉద్రిక్తత

మణిపూర్‌లో 2023 మే 3న హింసాత్మక ఘటనలు ప్రారంభమైన కొద్ది రోజులకే సామూహిక లైంగిక దాడికి గురైన 20 ఏండ్ల మహిళ గాయాలతో కోలుకోలేక మరణించింది. కిడ్నాప్‌ అయ్యి సామూహిక లైంగికదాడికి గురైన కుకీ జాతికి చెందిన బాధితురాలు గత మూడేండ్ల నుంచి కోలుకోలేదు.  తన కుమార్తె తీవ్ర గాయాలతో బాధపడేదని, ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడేదని, ఆఖరుకు ఈ నెల 10న మణిపూర్‌లోని సింగాట్‌లో కన్నుమూసిందని బాధితురాలి తల్లి తెలిపింది.

బాధితురాలిని 2023 మే 15న కిడ్నాప్‌ చేశాక ముగ్గురు ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. జూలై 22న ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అయినప్పటికీ ఇంతవరకు ఒక్క అరెస్ట్‌ కూడా చేయలేదు. కాగా, తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్న మణిపూర్‌లో గత ఏడాది ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించారు. మరణించిన ఆ యువ కుకీ మహిళకు న్యాయం చేయాలని పలు కుకీ సంస్థలు డిమాండ్ చేశాయి.

చురాచంద్‌పూర్, ఢిల్లీకి చెందిన కుకీ బృందాలు, మైతేయ్ సమాజంతో కలిసి జీవించడం ఇకపై సాధ్యం కాదని వాదిస్తూ, కుకీ సమాజానికి ప్రత్యేక పరిపాలన కావాలని తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించాయి. బాధితురాలి మరణం కుకీ-జో నివాసితులలో అభద్రతా భావాన్ని తీవ్రతరం చేసిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023 మే నుండి ఇంఫాల్ లోయలోని మైతేయ్,  కొండ జిల్లాలలోని కుకీ-జో సమూహాల మధ్య జాతి హింసతో రాష్ట్రం అట్టుడుకుతోంది, 
 
దీనివల్ల కనీసం 260 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.  ఐటిఎల్‌ఎఫ్, కేఎస్‌ఓ నిష్క్రియాత్మకతను ఖండించి, జవాబుదారీతనం డిమాండ్ చేశాయి. ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటిఎల్‌ఎఫ్) ఇలా పేర్కొంది, “ఆమె మరణం కుకీ-జో ప్రజలను ఎంత క్రూరంగా లక్ష్యంగా చేసుకున్నారో చెప్పడానికి మరో బాధాకరమైన సాక్ష్యం.
మా భద్రత, గౌరవం, మనుగడ కోసం” ప్రత్యేక పరిపాలన కోరడం తప్ప కుకీ-జో నివాసితులకు ఇప్పుడు వేరే మార్గం లేదని ఆ సంస్థ పేర్కొంది.
శనివారం చురాచంద్‌పూర్‌లో ఆమె గౌరవార్థం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (కేఎస్‌ఓ), ఢిల్లీ & ఎన్‌సిఆర్, బాధ్యులపై ఎలాంటి అర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ అధికారులను విమర్శించింది. “2023లో ఆమెపై జరిగిన హింస ఫలితంగానే ఆమె మరణం సంభవించిందని అధికారికంగా గుర్తించాలని మేము స్పష్టంగా నొక్కి చెబుతున్నాము. దీనిని వేరే విధంగా పరిగణించడానికి చేసే ఏ ప్రయత్నమైనా న్యాయాన్ని నిరాకరించడం మరియు బాధ్యతను తుడిచిపెట్టడమే అవుతుంది” అని ఆ బృందం పేర్కొంది.
 
గిరిజన జనాభా కోసం ప్రత్యేక పరిపాలనా నిర్మాణాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అది కేంద్రాన్ని కోరింది. కుకీ తెగకు చెందిన ఒక మహిళా బృందం, బాధితురాలు తాను భరించిన క్రూరత్వానికి మాత్రమే కాకుండా, తన అసాధారణ ధైర్యానికి కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొంది. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లోని కుకీ-జో మహిళా ఫోరం ఒక ప్రకటనలో, “దాదాపు మూడేళ్లుగా, ఏ మానవుడు కూడా భరించకూడని బాధను ఆమె మోసింది” అని పేర్కొంది.