ఏఆర్ రెహమాన్ ‘మతపరమైన’ వ్యాఖ్యలపై మండిపడ్డ కంగనా!

ఏఆర్ రెహమాన్ ‘మతపరమైన’  వ్యాఖ్యలపై మండిపడ్డ కంగనా!
బాలీవుడ్ లో సృజనాత్మకత లేనివారి రాజ్యం నడుస్తోందని, దీనికి మతపరమైన అంశం ఓ కారణమంటూ ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ చేసిన ‘మతపరమైన’ వాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బాలీవుడ్‌లో తమిళ్ లేదా మహారాష్ట్రేతరులపై పక్షపాతం ఉంటుందా?’ అనే ప్రశ్న ఎదురైంది.
 
 “8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ‘పవర్ షిఫ్ట్’ నెలకొంది. సృజనాత్మకత లేని వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనికి మతపరమైన అంశమూ ఓ కారణం కావచ్చు. అది నాకు నేరుగా ఎప్పుడూ ఎదురుకాలేదు. కానీ గుసగుసలు వినిపించాయి. నేను పని కోసం వెతకను. చిత్తశుద్ధి ఉంటే పనే మన వద్దకు వస్తుందని నమ్ముతా” అని రెహమాన్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
“మీ అంత పక్షపాతం, ద్వేషం నిండిన వ్యక్తిని నేను నా జీవితంలో చూడలేదు” అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రెహమాన్‌పై నిప్పులు చెరిగారు. తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను ప్రాపగండా చిత్రమంటూ రెహమాన్ అవమానించారని, కనీసం కథ వినడానికి కూడా నిరాకరించారని కంగనా ఆరోపణలు చేశారు. “ప్రియమైన ఏఆర్ రెహమాన్, నేను ఒక కాషాయ పార్టీకి (బీజేపీ) మద్దతు ఇస్తున్నందుకు ఈ సినీ పరిశ్రమలో ఎంతో వివక్షను, పక్షపాతాన్ని ఎదుర్కొంటున్నాను. కానీ, మీలో ఉన్నంత పక్షపాతం, ద్వేషం ఉన్న వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదని కచ్చితంగా చెప్పగలను” అని ఆమె ధ్వజమెత్తారు. 

“నేను నా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమా కథను మీకు వినిపించాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ మీరు కథ వినడం దేవుడెరుగు, కనీసం నన్ను కలవడానికి కూడా నిరాకరించారు. నేను కేవలం ప్రాపగండా (ప్రచార) సినిమాలు మాత్రమే తీస్తానని, అందుకే మీరు నా సినిమాలో భాగం కాకూడదని అనుకున్నట్లు నాకు తెలిసింది” అని కంగనా పేర్కొన్నారు.

తన సినిమాను విమర్శకులు మెచ్చుకున్నా రెహమాన్ మాత్రం ద్వేషంతో ఉన్నారని కంగనా మండిపడ్డారు. “ఎమర్జెన్సీ సినిమాను విమర్శకులు సైతం ‘మాస్టర్ పీస్’ అని కొనియాడారు. చివరికి ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా నాకు ఫ్యాన్ లెటర్లు రాశారు. సినిమా చాలా సమతుల్యంగా, మానవీయ కోణంలో ఉందని ప్రశంసించారు. కానీ మీరు మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. మీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది” అని ఆమె రాసుకొచ్చారు. 

రెహమాన్ వ్యాఖ్యలను ప్రముఖ రచయిత్రి శోభా డే తప్పుబట్టారు. “రెహమాన్ చేసింది చాలా ప్రమాదకరమైన వ్యాఖ్య. ఆయన ఎందుకు అలా అన్నారో ఆయన్నే అడగాలి. నేను 50 ఏళ్లుగా బాలీవుడ్‌ను చూస్తున్నాను. ఇక్కడ మతపరమైన ఉద్రిక్తతలు అస్సలు ఉండవు. బాలీవుడ్ అనేది అత్యంత లౌకికవాద ప్రదేశం. ఇక్కడ ప్రతిభ ఉంటే అవకాశాలు వస్తాయి” అని ఆమె స్పష్టం చేశారు.  “మతం అనేది ఇక్కడ అర్హత కాదు. రెహమాన్ లాంటి పరిణతి చెందిన వ్యక్తి, అంత విజయవంతమైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదు” అని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రముఖ గాయకుడు షాన్ కూడా రెహమాన్ వ్యాఖ్యలను ఖండించారు. “నేను ఎన్నో ఏళ్లుగా పాడుతున్నాను. నాకూ ఇప్పుడు పని తగ్గింది. అంత మాత్రాన దానికి మతం రంగు పులమలేం కదా? ఎవరికి ఎంత పని దొరకాలనేది మన చేతుల్లో ఉండదు. ఒకవేళ బాలీవుడ్‌లో మత వివక్షే ఉంటే, గత 30 ఏళ్లుగా షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఖాన్‌లు ఇక్కడ సూపర్ స్టార్లుగా ఎలా వెలుగొందుతున్నారు? వాళ్లు మైనారిటీలే కదా?” అని ప్రశ్నించారు. “వాళ్లకు మిగతా వారి కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. సంగీతానికి మతం, కులం ఉండవు. రెహమాన్​కి ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు” అని షాన్ హితవు పలికారు.

ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ మరో కోణాన్ని వినిపించారు. “ముంబయిలో రెహమాన్ అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయన చాలా పెద్ద మనిషి. పెద్ద స్థాయి సంగీత దర్శకుడు. అందుకే చిన్న నిర్మాతలు ఆయన దగ్గరకు వెళ్లడానికి భయపడుతుంటారు. అంతేకానీ ఇందులో మతపరమైన అంశం ఉందని నేను అనుకోవడం లేదు. ఎవరు పిలిచినా ఆయన కచ్చితంగా వస్తారు” అని జావేద్ అక్తర్ పేర్కొన్నారు.