గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలన్న పంతంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు విక్రయించేందుకు అంగీకరించకపోతే డెన్మార్క్ సహా యూరోపియన్ దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తమ మాట వినని 8 ఐరోపా దేశాలపై10 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు తెలిపారు.
ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ (ఈయు) గత ఏడాది జూలైలో ప్రకటించిన యూఎస్ – ఈయూ వాణిజ్య ఒప్పందాన్నితాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూరోపియన్ పీపుల్స్ పార్టీ ఉపాధ్యక్షుడు సిగ్‌ఫ్రిడ్ మురెసాన్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. “గత ఏడాది జూలైలో కుదిరిన యూఎస్-ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే రాటిఫై చేయాల్సి ఉంది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి ఈయూకు వచ్చే దిగుమతులపై సుంకాలను సున్నాకు తగ్గించే అవకాశం ఉండేది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాల్సి వస్తుంది” అని సిగ్‌ఫ్రిడ్ మురెసాన్ తెలిపారు.
గత ఏడాది అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే ఏకైక లాభం స్థిరత్వం మాత్రమేనని పేర్కొన్నారు. కానీ ట్రంప్ తాజా ప్రకటనతో ఆ స్థిరత్వం దెబ్బతిన్నదని, అందుకే ఈ వాణిజ్య ఒప్పంద రాటిఫికేషన్‌ను వాయిదా వేయడం సమంజసమని స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ సుంకాలపై ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ తీవ్రంగా స్పందించారు. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను దెబ్బతీస్తాయని, అలాగే ప్రమాదకరమైన స్థాయికి దారితీస్తాయని హెచ్చిరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
డెన్మార్క్ భౌగోళిక సమగ్రత, సార్వభౌమత్వం అంతర్జాతీయ న్యాయంలోని మౌలిక సూత్రాలు అని ఉర్సులా పేర్కొన్నారు. ఈ సూత్రాలు యూరప్‌కే కాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా అత్యంత అవసరమని తెలిపారు. నాటో సహా ఆర్కిటిక్ ప్రాంతంలో శాంతి, భద్రతపై ట్రాన్స్ అట్లాంటిక్ ప్రయోజనాలు తమకు ఉమ్మడిగా ఉన్నాయని చెప్పారు. ఇక ఇటీవల గ్రీన్లాండ్లో ఐరోపా దేశాలు మోహరించిన దళాలు డెన్మార్క్ ముందస్తుగా ప్రణాళిక చేసిన సైనిక విన్యాసంలో భాగమే అని వెల్లడించారు. దాని వల్ల ఎవరికీ ముప్పు కాదని స్పష్టం చేశారు.
మరోవంక, డెన్మార్క్ భూభాగంలో స్వయంపాలిత ప్రాంతమైన గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చేస్తున్న బెదిరింపులను నిరసిస్తూ శనివారం వేలాదిమంది ప్రజలు రాజధాని కోపెన్‌హేగన్, గ్రీన్‌లాండ్ రాజధాని నూక్‌లో కదంతొక్కారు. మార్చ్‌లు, ర్యాలీల్లో పాల్గొనాలని సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చిన పిలుపులకు బ్రహ్మాండమైన స్పందన కనిపించింది. డెన్మార్క్, గ్రీన్‌లాండ్ పతాకాలను ప్రదర్శిస్తూ ఆందోళనకారులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
వారి ప్రదర్శన శ్వేతారుణ వర్ణాల్లో సంద్రాన్ని తలపింపచేసింది. అమెరికన్ కాంగ్రెస్ నుండి ద్విపక్ష ప్రతినిధి బృందం కోపెన్‌హేగన్‌లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. ట్రంప్ ఆలోచనలను చాలామంది అమెరికన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆ బృందం స్పష్టం చేసింది.

More Stories
ఏఆర్ రెహమాన్ ‘మతపరమైన’ వ్యాఖ్యలపై మండిపడ్డ కంగనా!
ముంబై మేయర్ పదవికోసం శివసేన జగడం!
బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన సమయం వచ్చింది