రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరై విజయసాయిరెడ్డి పలు అంశాలను వెల్లడించారు. ఈ కేసు విషయంలో రెండు సార్లు మీడియా ముందుకు వచ్చారు.
గత ఏడాది ఏప్రిల్ 22న సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా తాను ఈ కేసులో విజిల్ బ్లోయర్ అంటూ పోస్టు పెట్టారు. గత ఏడాది ఏప్రిల్ 18న తొలిసారి సిట్ విచారణకు హాజరైన తర్వాత తాను వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానాలపై జరిగిన సమావేశాల్లో రెండు సార్లు పాల్గొన్నానని- కిక్‌బ్యాక్‌లు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చారు.
ఈ కుంభకోణానికి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డిని సూత్రధారిగా పేర్కొంటూ ఆరోపణలు చేశారు. గత ఏడాదిలో మే నెలలో సీఐడీ విచారణలో మద్యం కుంభకోణం వెనుక ఉన్న అసలు వ్యక్తుల వివరాలను అధికారులకు తెలియజేసినట్లు చెప్పారు. మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించిన సమావేశాల్లో కెసిరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నట్లు సిట్ దృష్టికి తెచ్చారు.
మద్యం కుంభకోణంలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతని బంధువు అవినాష్ రెడ్డి, మరికొందరు వ్యక్తులు హవాలా మార్గాల్లో డబ్బు తరలించారని వివరించారు. అయితే, మద్యం విధానం అమలులో తాను నేరుగా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, అమ్మకాలతో తనకు సంబంధం లేదని గతంలో సిట్ ముందు స్పష్టం చేశారు.
ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు సిట్ మొత్తం 16 మందిని అరెస్టు చేసింది. వీరిలో వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి వంటి ముఖ్యులతోపాటు ముంబైకి చెందిన బులియన్ వ్యాపారి అనిల్ చోక్రాను ఉన్నారు. మొత్తం 48 మందిపై కేసులు నమోదయ్యాయి. మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.
గత ఏడాది జూలై 19న 305 పేజీలతో ప్రాథమిక అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. అదే ఏడాది ఆగస్టు 12న సుమారు 200 పేజీలతో అదనపు ఛార్జిషీట్ వేసింది. సెప్టెంబరు నెలలో మూడో ఛార్జిషీట్‌ను కూడా సమర్పించింది. ఈ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
More Stories
ఎగుమతుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానం
పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగంలో అంతరాయం
బాలికల విద్య దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది