తెలంగాణ రాజకీయాల్లో పోటీ కాంగ్రెస్ – బిజెపి మధ్యే

తెలంగాణ రాజకీయాల్లో పోటీ కాంగ్రెస్ – బిజెపి మధ్యే
 
* త్వరలో బిఆర్ఎస్  ముక్కలవ్వడం ఖాయం
 

ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో పోటీ కేవలం కాంగ్రెస్ – బిజెపి మధ్యే ఉందని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఈ రెండు పార్టీలనే ప్రత్యామ్నాయాలుగా చూస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా కనుమరుగైందని తెలిపారు.  మున్సిపల్ కార్పొరేషన్ & మున్సిపాలిటీ ఎన్నికల విజయ్ సంకల్ప సమ్మేళనంలో మాట్లాడుతూ త్వరలో బిఆర్ఎస్  ముక్కలవ్వడం ఖాయం అని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నేడు 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని,  దోచుకున్న ప్రజాసొమ్మును పంచుకోవడంలోనే బిఆర్ఎస్ వారు నిమగ్నమై ఉన్నారని, ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని ఆయన ధ్వజమెత్తారు.  తెలంగాణ రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించి ఏ క్షణమైనా ఎన్నికలు జరగొచ్చని చెబుతూ  ఆ ఎన్నికలకు బిజెపి తయారై ఉందని తెలిపారు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇంచార్జ్‌లుగా నియమితులైన వారు విస్తృత ప్రచారం చేసి బిజెపి జెండా ఎగురవేసేలా సంసిద్ధంగా ఉండాలని ఆయన పిలుపిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయం మన మొదటి మెట్టు కాగా, రెండో మెట్టు రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడమే అని చెప్పారు.

ఇటీవల గ్రామ పంచాయతీల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సుమారు వెయ్యి మంది సర్పంచులు, దాదాపు 10 వేల మంది వార్డు మెంబర్లు, 1200 నుంచి 1500 మధ్య ఉపసర్పంచులను గెలుచుకున్నామని రామచందర్ రావు తెలిపారు. బిజెపి కేవలం 5 వేల స్థానాల్లో మాత్రమే పోటీ చేసినప్పటికీ, గతంలో 150 సర్పంచ్ స్థానాల నుంచి నేడు దాదాపు వెయ్యి సర్పంచ్ స్థానాల్లో గెలవడం అంటే గ్రామీణ ప్రజల్లో కూడా బిజెపికి ఆదరణ వేగంగా పెరుగుతోందని స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ సుమారు 10 వేల స్థానాల్లో పోటీ చేసి కూడా కేవలం రెండు వేల స్థానాల్లో మాత్రమే గెలిచిందని చెబుతూ కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలిచిన వారంతా తమవారేనని చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లడం – రావడం లేదా బహిరంగ సభలు పెట్టడం తప్ప పాలనపై దృష్టి పెట్టడం లేదని ఆయన విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? అని రావు ప్రశ్నించారు. రైతులకు రైతుబంధు బంద్ పెట్టారని, ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేడు 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని దుయ్యబట్టారు.

మంత్రుల మధ్య బహిరంగ ఘర్షణలు జరుగుతున్నాయని, పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో అసలు అభివృద్ధి లేదని, కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు.  గత 11 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ. 12 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని తెలిపారు.

అయినప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ రోజు నగరాలు ముందుకు వెళ్తున్నాయంటే, స్వచ్ఛ భారత్ అమలవుతుందంటే, అమృత్ సిటీలు, స్మార్ట్ సిటీల కింద అభివృద్ధి జరుగుతుందంటే.. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లనే సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని రావు ఆరోపించారు.

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసినదంతా శూన్యం కాగా, గతంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరింతగా దోచుకుంటోందని రామచందర్ రావు ధ్వజమెత్తారు. మన భవిష్యత్తు బాగుండాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని తేల్చి చెప్పారు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే, పేదలకు ఇండ్లు రావాలంటే, ఆరోగ్య భద్రత కావాలంటే- అది కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల ద్వారానే సాధ్యం అని స్పష్టం చేశారు.

 
కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి పక్షనేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేష్, శాసనసభ్యులు  పాయల్ శంకర్,వెంకటరమణా రెడ్డి, రామారావు పాటిల్,  సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, బిజెపి రాష్ట్ర ఇంచార్జ్  అభయ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.