వందేభారత్ తొలి స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

వందేభారత్ తొలి స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమ బంగాల్‌లోని మాల్దాలో పర్యటించిన ప్రధాని హౌడా-గువాహటి మధ్య తిరిగే వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. గువాహటి నుంచి హౌడాకు తిరిగివచ్చే స్లీపర్ రైలుకు ఆయన వర్చువల్‌గా పచ్చజెండా ఊపారు.  వందే భారత్ స్లీపర్ రైలులో పిల్లలు, విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. వందేభార‌త్ రైలు మేడిన్ ఇండియా అని, భార‌తీయులు త‌మ చ‌మ‌టోడ్చి ఈ రైలును నిర్మించిన‌ట్లు ప్రధాని చెప్పారు.
ప‌విత్ర‌మైన బెంగాల్ నేల నుంచి భార‌తీయ రైల్వేల ఆధునీక‌ర‌ణ‌కు మ‌రో కీల‌క అడుగు ప‌డింద‌ని, దేశంలో ఇవాళ వందేభార‌త్ స్లీప‌ర్ రైళ్ల‌ను ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు.  చాలా సౌక‌ర్య‌వంతంగా, విలాస‌వంతంగా, మ‌రుపురాని రీతిలో ప్ర‌యాణం సాగేట్టు వందేభార‌త్ రైళ్ల‌ను నిర్మించిన‌ట్లు చెప్పారు. విక‌సిత్ భార‌త్‌లో ఎలాంటి రైళ్లు ఉండాలో వందేభార‌త్‌ను చూస్తే తెలుస్తుంద‌న్నారు.
పూర్తిస్థాయి ఏసీ బోగీలు కలిగిన వందే భారత్ స్లీపర్ రైలు విమానంలో ప్రయాణించిన అనుభూతిని కలిగిస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.  సుదూర ప్రయాణాలను వేగంగా, సురక్షితంగా, మరింత సౌకర్యవంతంగా చేయడానికి వందే భారత్ స్లీపర్ రైలు అనువైనదని పిఎంఓ పేర్కొంది. ఈ రైలు హౌడా- గువాహటి మధ్య ప్రయాణ సమయాన్ని రెండున్నర గంటలు తగ్గిస్తుందని తెలిపింది. దీని వల్ల ఆధ్యాత్మిక యాత్రలకు, పర్యాటకానికి మంచి ఊతం లభిస్తుందని వివరించింది.
 
ఈ స్లీపర్‌ రైలు గరిష్ఠంగా గంటకు 180 కి.మీ. వేగాన్ని చేరుకుంది. రీసెంట్గా రైల్వే భద్రత కమిషనర్‌ (సిఆర్ఎస్) సమక్షంలో రాజస్థాన్‌లోని కోటా నుంచి మధ్యప్రదేశ్లోని నాగ్దా మధ్య స్పీడ్ టెస్టింగ్ చేశారు.  ఈ టెస్టింగ్ లో వందేభారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీ. వేగాన్ని సాధించింది. ఈ సమయంలో గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా పెట్టి రైలులో ఉంచినా, గరిష్ఠ వేగాన్ని చేరుకున్నప్పుడు ఒక్క చుక్క నీరు బయటకు చిలకలేదు. దీనికి సంబంధించిన వీడియోను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.