పదేళ్లలో స్టార్టప్స్, టెక్‌ విభాగాల్లో ప్రపంచ అగ్రగామిగా భారత్‌

పదేళ్లలో స్టార్టప్స్, టెక్‌ విభాగాల్లో ప్రపంచ అగ్రగామిగా భారత్‌

రాబోయే పదేళ్లలో స్టార్టప్స్, టెక్‌ విభాగాల్లో ప్రపంచ అగ్రగామిగా భారత్‌ను నిలపడమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ లక్ష్యం దిశగా భారతీయ స్టార్టప్‌లు వైవిధ్యంతో, సాహసోపేతంగా పురోగమిస్తాయనే పూర్తి విశ్వాసం తనకు ఉందని తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై భవిష్యత్ వ్యూహాన్ని కలిగిన దేశాలకే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

‘నేషనల్ స్టార్టప్ డే’ సందర్భంగా శుక్రవారం దిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ  2014లో దేశంలో 4 యూనికార్న్‌‌లే ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 125కు చేరిందని, పదేళ్ల క్రితం 500 స్టార్టప్‌లే ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 2 లక్షలు దాటిందని తెలిపారు. ఒక్క 2025 సంవత్సరంలోనే 44వేల స్టార్టప్‌లు రిజిస్టర్ అయ్యాయని ఆయన తెలిపారు. 

ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లోనే ఉందని చెబుతూ ‘నేషనల్ స్టార్టప్ డే’ వేడుకకు హాజరైన స్టార్టప్‌ల వ్యవస్థాపకులను చూస్తుంటే, తనకు నవ్య భారత్, వికసిత భారత్ కనిపిస్తోందని మోదీ భరోసా వ్యక్తం చేశారు.

“స్టార్టప్ ఇండియా మిషన్ వేగాన్ని పుంజుకుంటోంది. అదొక విప్లవంగా మారింది. ఇక కంఫర్ట్ జోన్‌లో జీవించే ఉద్దేశం భారతీయ యువతకు లేనే లేదు. నూతన లక్ష్యాలతో సరికొత్త ఎత్తులకు ఎదగాలని వారు కోరుకుంటున్నారు. అసలైన సమస్యల పరిష్కారంపై భారతీయ యువత, ఎంట్రప్రెన్యూర్‌లు ఫోకస్ పెట్టారు. టైర్-2, టైర్-3 నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల యువత కూడా సొంతంగా వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు” అని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. 
 
స్టార్టప్ ఇండియా కార్యక్రమం వల్ల భారత్‌లో ఏర్పడిన ఎన్నో యూనికార్న్‌లు స్టాక్ మార్కెట్‌లో ఐపీఓలకు వస్తున్నాయని, ఎంతోమందికి ఉద్యోగాలను ఇస్తున్నాయని ప్రధాని చెప్పారు. 45 శాతం భారతీయ స్టార్టప్‌లలో సగటున ఒక మహిళా డైరెక్టర్ లేదా పార్ట్‌నర్ ఉన్నారని పేర్కొంటూ మహిళల సారథ్యంలో ఏర్పాటయ్యే స్టార్టప్‌లకు ఫండింగ్‌ను అందించే విషయంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ ఎదిగిందని ప్రధాని తెలిపారు. 
 
“గతంలో సొంత వ్యాపారం ప్రారంభించడాన్ని రిస్క్‌గా భావించేవారు. రిస్క్ పేరు చెప్పి యువతను నిరుత్సాహపరిచేవారు. కానీ ఇప్పుడు రిస్క్ తీసుకొని వ్యాపారాలను మొదలుపెట్టడమే భారతీయ యువతకు ప్రధాన పనిగా మారిపోయింది. భారతీయ స్టార్టప్‌ల వ్యవస్థాపకుల అత్యద్భుత విశ్వాసం, గొప్ప ఆశయాలను చూసి నేను మంత్రముగ్ధుడిని అయ్యాను” అని ప్రధాని చెప్పారు. 
 
“ఒకప్పుడు సొంత వ్యాపారం పెట్టడం అనేది కెరీర్‌లో చిట్టచివరి ఆప్షన్‌గా ఉండేది. కానీ ఇప్పుడది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. నెలవారీ శాలరీని మించి ఆలోచించే వాళ్లను ఇప్పుడు అందరూ స్వాగతిస్తున్నారు, గౌరవిస్తున్నారు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.“స్టార్టప్ ఇండియా అనేది ఒక స్కీం మాత్రమే కాదు. దానికి ఇంద్ర ధనుస్సు లాంటి పెద్ద విజన్ ఉంది. కొత్త వ్యాపార అవకాశాలతో దేశంలోని అన్ని రంగాలను కనెక్ట్ చేయడమే దీని లక్ష్యం. భారతీయ స్టార్టప్‌లు తయారీ రంగం, పరిశోధనలపైనా ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఈ రోజు చేసే పరిశోధనే రేపటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీగా మారుతుంది” అని స్పష్టం చేశారు. 

స్టార్టప్‌లకు సీడ్ ఫండ్‌ను అందించడానికి చాలా స్కీంలను అమల్లోకి తెచ్చామని చెబుతూ కాలం చెల్లిన రూల్స్ అన్నీ తొలగించామని తెలిపారు.  ఈ ఏడాదితో స్టార్టప్ ఇండియా కార్యక్రమం పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని చెప్పారు.