ఎక్స్‌కు సంబంధించి గ్రోక్లో అసభ్యకరమైన కంటెంట్ ఏఐ చిత్రాల విషయంలో ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ , ఆయన మాజీ భాగస్వామి ఆష్లీ సెయింట్ క్లైర్ కోర్టుకెక్కారు. తన అనుమతి లేకుండా అసభ్యకరమైన, అభ్యంతరకరమైన డీప్‌ఫేక్ చిత్రాలను గ్రోక్ సృష్టించిందని ఆరోపిస్తూ ఆమె న్యూయార్క్ కోర్టులో దావా వేశారు.
ఆష్లీ సెయింట్ క్లైర్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం గ్రోక్ ఏఐ ద్వారా కొందరు యూజర్లు ఆమె నగ్న చిత్రాలను, అసభ్యకర భంగిమల్లో ఉన్న ఫోటోలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం ప్రస్తుత ఫోటోలనే కాకుండా ఆమె చిన్నతనంలో ఉన్నప్పటి ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి బికినీల్లో చూపిస్తున్నారని ఆమె వాపోయారు.
దీనివల్ల తనకు తీవ్రమైన మానసిక వేదన కలగడమే కాకుండా, తన భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ చిత్రాలను అడ్డుకోవాలని కోరినప్పటికీ.. ఎక్స్ఏఐ సంస్థ తగిన చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. అయితే ఈ విషయంపై ఆష్లీ బహిరంగంగా ఫిర్యాదు చేసినందుకు ప్రతిగా ఎలాన్ మస్క్ తనపై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆమె తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఆష్లీ ఎక్స్ అకౌంట్‌కు వచ్చే ఆదాయాన్ని నిలిపివేశారని.. అంతేకాకుండా మరిన్ని అసభ్య చిత్రాలు సృష్టించేలా సిస్టమ్ ఉందని ఆరోపించారు.
మరోవైపు xAI సంస్థ కూడా ఆమెపై టెక్సాస్ కోర్టులో కౌంటర్ కేసు వేసింది. ఆష్లీ నుంచి 75 వేల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు 66 లక్షల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేసింది. గతంలో ఎలాన్ మస్క్‌పై ఆష్లీ సెయింట్ క్లైర్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. తనకు, ఎలాన్ మస్క్‌కు పుట్టిన రోములస్‌కు.. తండ్రి అతడే అని ఎక్కడా బయటపెట్టవద్దని, అందుకు ప్రతిగా 15 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.125 కోట్లు ఆఫర్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం వీరిద్దరి మధ్య తమ ఏడాది కుమారుడు రోములస్ కస్టడీ కోసం కూడా తీవ్రమైన పోరాటం నడుస్తోంది. ఆష్లీ తన కుమారుడిని తప్పుగా పెంచుతోందని ఆరోపిస్తూ ఎలాన్ మస్క్ పూర్తి కస్టడీని కోరుతుండగా దాన్ని ఆమె ఖండించారు.

More Stories
ఎఐ సంపన్నుల చేతుల్లో ఆయుధం.. భవిష్యత్ లో ముప్పు
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడుకు 5 ఏళ్ళు జైలు శిక్ష
ఐరాస వేదికలను దుర్వినియోగం చేస్తున్న పాక్