హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందేందుకు ముందుగా మెట్రో తొలిదశను ఎల్ అండ్ టీ నుంచి తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్రాసిన లేఖలో మెట్రో రెండో దశపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో తాను చర్చించినట్లు తెలిపారు.
మెట్రో టేకోవర్ ఒప్పందాలు, దానికి సంబంధించిన లావాదేవీలు ఇంకా పూర్తి చేయలేదని ఆయన చెప్పారని తెలిపారు. ఈ లావాదేవీల ప్రక్రియ జరిగిన అనంతరం హైదరాబాద్ మెట్రో రెండో దశపై కేంద్రం చర్యలు చేపడుతుందని తెలిపారని వెల్లడించారు. కేంద్రం ఇప్పటికే మెట్రో రెండో దశకు అంగీకరించినట్లు మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారని, రెండో దశపై కమిటీ ఏర్పాటుకు సైతం నిర్ణయం తీసుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టి కంపెనీ నుంచి తీసుకోవడం, రెండో దశకు సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డితో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నామని ఖట్టర్ తెలిపారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని కానీ, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను ప్రతిపాదించలేదని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారుల పేర్లు పంపాలని కిషన్ రెడ్డి కోరారు.
2026 మార్చి 31 లోగా మొదటి దశ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. రెండోదశలో విస్తరణ ప్రతిపాదనలు పంపాలని కేంద్రం ప్రభుత్వం చెబుతోంది. మెట్రోరైలు2(ఏ)లో సుమారు 5 మార్గాలు ఉన్నాయి. 2(బి)లో 3 మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో రెండో దశను నిర్మించాలని నిర్ణయించారు. అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు పంపగా అనుమతి రాలేదు.

More Stories
ఏపీ, తెలంగాణ జల వివాదాలపై కమిటీ 30న తొలి భేటీ
క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం
మైసమ్మ దేవాలయంలో దేవతా విగ్రహం అపవిత్రంపై ఆగ్రవేశాలు