దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడుకు 5 ఏళ్ళు జైలు శిక్ష

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడుకు 5 ఏళ్ళు జైలు శిక్ష

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు గతేడాది దేశంలో అశాంతిని సృష్టించి, విఫలమైన ‘మార్షల్ లా’ (సైనిక పాలన) విధింపునకు ప్రయత్నించిన కేసులో అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అధికారంలో ఉండగానే అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా చరిత్రకెక్కిన యూన్ సుక్ యోల్‌కు ఈ తీర్పు కోలుకోలేని దెబ్బగా మారింది. 

యూన్ సుక్ యోల్ అరెస్ట్ ప్రక్రియ ఒక హై-డ్రామాను తలపించింది. జనవరిలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా తన నివాస సముదాయంలో బారికేడ్లు వేయించుకుని లోపలికి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకున్నారు. సెక్యూరిటీ సర్వీస్ అధికారులను కూడా ఇన్వెస్టిగేటర్లను అడ్డుకోవాలని ఆదేశించి విధి నిర్వహణకు ఆటంకం కలిగించారు. 

చివరకు సుమారు 3,000 మందికి పైగా పోలీసు అధికారులతో భారీ ఆపరేషన్ చేపట్టి రెండో ప్రయత్నంలో ఆయనను అధికారులు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. కోర్టు విచారణలో యూన్ సుక్ యోల్‌పై ప్రధానంగా మూడు రకాల ఆరోపణలు రుజువయ్యాయి. అందులో ఒకటి వారెంట్ అమలు చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడం. రెండోది 2024 డిసెంబర్‌లో మార్షల్ లా ప్రకటించినప్పుడు అధికారిక పత్రాలను తారుమారు చేయడం.

ఇక మూడోది ప్రతిపక్షాలను, ప్రభుత్వ వ్యతిరేక శక్తులను అణచివేసేందుకు ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రమాదంలోకి నెట్టడం.  ప్రస్తుతానికి ఐదేళ్ల శిక్ష ఖరారైనప్పటికీ యూన్ సుక్ యోల్ ముందు అసలైన సవాలు ‘ఇన్సురెక్షన్’ (తిరుగుబాటు) కేసు రూపంలో ఉంది. దేశంలో సాయుధ తిరుగుబాటుకు ప్లాన్ చేశారనే ఆరోపణపై ప్రాసిక్యూటర్లు ఆయనకు మరణశిక్ష విధించాలని కోర్టును కోరారు. ఈ కీలకమైన కేసులో తీర్పు ఫిబ్రవరిలో వెలువడనుంది.