బెంగాల్‌లో ఈడీ దర్యాప్తునకు ఆటంకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

బెంగాల్‌లో ఈడీ దర్యాప్తునకు ఆటంకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో సోదాల సమయంలో సీఎం మమతా బెనర్జీ ఆటంకాలు కలిగించారన్న ఈడీ అభియోగాలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ దర్యాప్తును అడ్డుకోవడం తీవ్రమైన అంశమని అభిప్రాయపడింది. 

ఈ అంశంపై తదుపరి విచారణ జరిపేందుకు సీఎం మమత, డీజీపీ రాజీవ్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. ఈడీ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను పరిశీలించకపోతే అది చట్టవిరుద్ధమే అవుతుందని పేర్కొంది. ఐప్యాక్‌పై దాడులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని భద్రపర్చాలని బంగాల్​ పోలీసులను ధర్మసనం ఆదేశించింది. ఈడీ అధికారులపై రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధించింది.

ఇటీవల ఈడీ దాడుల కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టులో జరిగిన గందరగోళంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈడీ పిటిషన్​పై ఫిబ్రవరి 3న విచారిస్తామని తెలిపింది. బంగాల్ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ పాత్ర కూడా ఉందని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 

‘గతంలో కూడా చట్టబద్ధ అధికారాలు తమ విధులను నిర్వహించే సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన ధోరణిని ప్రతిబింబిస్తోంది. ఇలాంటి చర్యలకు ఉదాహరణగా మారితే, భవిష్యత్తులో మరింతగా ప్రోత్సాహం లభిస్తుంది. దాంతో కేంద్ర దర్యాప్తు సంస్థల మనోబలం దెబ్బతింటుంది. రాష్ట్రాలు ఇలా చొరబడి, దొంగతనానికి పాల్పడి, ఆ తర్వాత ధర్నాకు కూర్చోవచ్చనే భావన కలగవచ్చు. ఇది సరైనది కాదు’ అని తుషార్ మెహతా సుప్రీంకోర్టును తెలిపారు.

ఐప్యాక్ కార్యాలయంలో నేరారోపణకు సంబంధించిన కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు. ‘మా అధికారుల హక్కులను కాపాడేందుకే ఈడీ చర్యలు చట్టబద్ధమేనన్న వివరణను ఒక ఉదాహరణ చూపాలి. అక్కడ ప్రత్యక్షంగా ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలి’ అని కోరారు.  “తగిన అధికారులను ఆదేశించాలి. జరుగుతున్న పరిణామాలపై కోర్టు దృష్టి సారించాలి. మేము మా అధికారుల మౌలిక హక్కులను కాపాడేందుకే ఇక్కడికి వచ్చాం. మేం చట్టం ప్రకారమే పనిచేస్తున్నాం. వ్యక్తిగత లాభాల కోసం ఎలాంటి స్వాధీనాలు చేయడం లేదు’ అని మెహతా స్పష్టం చేశారు.

ఈడీ వాదనలను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తీవ్రంగా వ్యతిరేకిరంచారు. ముందుగా ఆ వ్యవహారాన్ని కలకత్తా హైకోర్టే విచారించాలని, న్యాయపరమైన క్రమాన్ని పాటించాలని ఆయన సూచించారు. ఈడీ సమాంతర విచారణలకు పాల్పడుతోందని ఆరోపించారు.  “అన్ని డిజిటల్ పరికరాలు తీసుకెళ్లారన్న ఆరోపణ పూర్తిగా అబద్ధం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్ని పరికరాలు తీసుకెళ్లారన్నది కూడా అవాస్తవం. ఈ విషయాన్ని ఈడీ తయారు చేసిన పంచనామా (శోధన నివేదిక)నే నిరూపిస్తోంది. బొగ్గు అక్రమ రవాణా కేసులో చివరి స్టేట్‌మెంట్ ఫిబ్రవరి 2024లోనే నమోదు చేశారు. అప్పటి నుంచి ఈడీ ఏం చేస్తోంది? ఎన్నికల సమయంలోనే ఇంత ఉత్సాహం ఎందుకు?” అని కపిల్ సిబల్ ప్రశ్నించారు.