వైవిధ్యాన్నే బలంగా మార్చుకొని ఎదుగుతున్నాం

వైవిధ్యాన్నే బలంగా మార్చుకొని ఎదుగుతున్నాం
దేశంలోని వైవిధ్యాన్నే బలంగా మార్చుకొని, ప్రపంచంలో అత్యంత వేగంగా వికసిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. గురువారం న్యూడిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో కామన్వెల్త్ దేశాల స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల 28వ సదస్సును ప్రారంభిస్తూ ప్రజాస్వామిక విధానాల వల్లే భారత్ వికాస పథంలో దూసుకుపోతోందని చెప్పారు.

ప్రజా కేంద్రక విధానాలతో తమ ప్రభుత్వం పని చేస్తున్నందు వల్లే ఈ సత్ఫలితాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. భారత్ స్వతంత్రంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక, కొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. వైవిధ్యం కలిగిన భారత్‌లో ప్రజాస్వామ్యం ఎలా విజయవంతమైందనే అనుమానాలు కొందరికి వస్తున్నాయని పేర్కొన్నారు.

“భారత్‌లోని ప్రజాస్వామిక సంస్థలు, ప్రజాస్వామిక పద్ధతులే ఇక్కడి ప్రజాస్వామ్యానికి సుస్థిరతను, వేగాన్ని, సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఈ దేశపు ప్రజాస్వామిక విజయంపై చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. జనాభాలో ఇంత భారీ వైవిధ్యంతో ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడం కష్టమన్నారు. మేం ఆ వైవిధ్యాన్నే ప్రజాస్వామిక వ్యవస్థ బలంగా మార్చుకున్నాం” అని ప్రధాని చెప్పారు.

“ఇక్కడి ప్రజాస్వామిక సంస్థలు, ప్రజాస్వామిక పద్ధతులు దేశ వికాసానికి బాటలు వేశాయి. ఇప్పుడు ప్రపంచంలో వేగంగా వికసిస్తున్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ పేరు ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వేదికగా భారతదేశ యూపీఐ ఎదిగింది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. ఉక్కు ఉత్పత్తిలోనూ ప్రపంచంలో నంబర్ 2 స్థానంలో ఉన్నాం” అని ప్రధాని గుర్తు చేశారు. 

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లో ఉందని, విమానయాన రంగంలో మూడో అతిపెద్ద మార్కెట్ తమదే అని తెలిపారు. భారత రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలో నాలుగో అతిపెద్దదని, ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైల్ నెట్‌వర్క్ భారత్‌లో ఉందని, అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారత్ నిలిచిందని ప్రధాని వివరించారు.

“ఈ సదస్సు జరుగుతున్న భారత పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు దీనికి సంవిధాన్ సదన్ అని పేరు పెట్టాం. భారత స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఇందులోనే రాజ్యాంగ సభ సమావేశాలు జరిగేవి. ఇందులోనే 75 ఏళ్ల పాటు భారత పార్లమెంటు కార్యకలాపాలు జరిగాయి. భారత భవిష్యత్తుపై కీలక నిర్ణయాలను ఇందులోనే తీసుకున్నాం” అని ప్రధాని చెప్పారు. 

చర్చలు, సంప్రదింపులు, ఉమ్మడి నిర్ణయాలు భారత ప్రజాస్వామిక సంప్రదాయంలో కీలక భాగాల అని పేర్కొంటూ భారత్‌లో ప్రజాస్వామ్యం అంటే అర్ధవంతమైన పద్ధతిలో చివరి నిమిషం దాకా కూలంకష చర్చలను కొనసాగించడం అని తెలిపారు. ప్రజాస్వామిక విధానాలకు ప్రతీకగా నిలిచే సంవిధాన్ సదన్‌ భవనాన్ని ప్రజాస్వామ్యానికి అంకితమిచ్చాం అని ప్రధాని మోదీ తెలిపారు.

“మేం ప్రతి అంతర్జాతీయ వేదికపై గ్లోబల్ సౌత్ గురించి గళం విప్పుతున్నాం. జీ20 కూటమికి సారథ్యం వహించిన సమయంలోనూ భారత్ ఈవిషయంపై బలమైన వాణిని వినిపించింది. జీ20 సదస్సు అజెండాలోనూ గ్లోబల్ సౌత్‌తో ముడిపడిన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాం” అని ప్రధాని మోదీ చెప్పారు.

“ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా సవాళ్లకు భారత ప్రధాని మోదీ నాయకత్వం చాలా పరిష్కారాలను చూపుతోంది. అందుకే యావత్ ప్రపంచం ఆయన వైపు చూస్తోంది” అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. భారత్ ఇప్పటివరకు 7 దశాబ్దాలకుపైగా పార్లమెంటరీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని చెబుతూ ప్రజా కేంద్ర విధానాలు, సంక్షేమ కేంద్రక చట్టాలతో భారత ప్రజాస్వామ్యం బలోపేతం అవుతోందని చెప్పారు. 

అందరు పౌరులకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించే స్వతంత్ర, నిష్పాక్షిక ఎన్నికల వ్యవస్థ భారత్‌లో ఉందని, పార్లమెంటు, భారత ప్రభుత్వం కలిసి గత కొన్నేళ్లలో 1500కుపైగా కాలం చెల్లిన చట్టాలలో సవరణలు చేశాయని, ఎన్నో కొత్త జన సంక్షేమ చట్టాలను అమల్లోకి తెచ్చాయని, తద్వారా భారత్‌ను స్వయం సమృద్ధి, వికాసం దిశగా నడిపిస్తున్నాం అని ఓం బిర్లా వివరించారు.

కామన్వెల్త్‌ దేశాల సమాఖ్యలోని 42 దేశాల నుంచి దాదాపు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. వీరితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.