ఇరాన్లో నిరసనలు తీవ్రమయ్యాయి. మరణించిన వారి సంఖ్య 2,500 దాటింటి. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులను తాజాగా హెచ్చరించింది. ఇరాన్లో చెలరేగిన అల్లర్లు తీవ్రరూపం దాల్చడంతో ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు వెంటనే ఆ దేశాన్ని విడిచి తిరిగి స్వదేశానికి రావాలని భారత్ ఆదేశించింది.
ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. తాజా పరిణామాల దృష్ట్యా ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. భారత పౌరులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను వీడాలని పేర్కొంది. ప్రయాణానికి అవసరమైన పాస్‌పోర్ట్, ఐడీ కార్డు, ఇతర ఇమ్మిగ్రేషన్ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది.
ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులైన విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులు వాణిజ్య విమానాలతో సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా బయలుదేరాలని కోరింది. అలాగే ప్రయాణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఏదైనా సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఈ నెల 5న భారత విదేశాంగశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో అక్కడ నివసిస్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. సంప్రదింపుల కోసం అత్యవసర హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఇంకా నమోదు చేసుకోని భారతీయ పౌరులు https://www.meaers.com/request/home లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరింది. ఇరాన్లో ఇంటర్నెట్ అంతరాయాల కారణంగా నమోదు చేసుకోలేకపోతే, భారత్‌లోని కుటుంబ సభ్యులు ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.

More Stories
ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కెనడా 40 ఏళ్లుగా విఫలం
ఇరాన్ నిరసనలతో 2 వేల మందికి పైగా మృతి
డ్రగ్స్ గ్యాంగ్ వార్ లో పంజాబ్ సంతతి యువకుడు కాల్చివేత