మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాలు.. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్

మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాలు.. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు ఎన్టీవీ న్యూస్ ఛానల్ పై కఠినమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఎన్టీవీ ఇన్ ఫుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ లను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు.  ఐదురోజుల క్రితం ప్రసారమైన వార్త మీద సీపీ సజ్జనార్ నేతృత్వంలో మంగళవారం సిట్ ఏర్పాటు చేయగానే, సాయంత్రం ఈ ప్రసారాలపై సాయంత్రం క్షమాపణ కోరుతూ ఎన్టీవీలో ప్రసారం చేశారు.
తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుండగా ఇన్‌పుట్ ఎడిటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  కాగా, మహిళా ఐఏఎస్‌ను కించపరిచే విధంగా 44 యూట్యూబ్ ఛానల్స్ కథనాలు ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆయా యూట్యూబ్ ఛానళ్లపై చర్యలకు రంగం సిద్ధమైంది.
 
ఛానల్స్ బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసుల సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పలువురిని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసుల దూకుడుతో పలువురు యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం.  అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సరికాదంటూ పోలీసులకు  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితవు చెప్పారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తూ నాయకులు, అధికారులపై మీడియాలో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేయడం మంచి సంప్రదాయం కాదని ఆయన స్పష్టం చేశారు. 
 
గతంలో కూడా ఎన్నోసార్లు నాయకులు, అధికారులపై యుట్యూబ్ ఛానళ్లలో అసత్య, తప్పుడు కథనాలు ప్రసారం అయ్యాయని, అప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు కదా? అని ప్రశ్నించారు. జర్నలిస్ట్‌లకు నోటీస్‌లు ఇచ్చి వ్యక్తిగతంగా వారి వివరణ తీసుకుంటే బాగుండేదని సూచించారు.  ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్‌ల అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడుతూ పండుగ సమయంలో అర్ధరాత్రి పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగులగొట్టి అరెస్టులు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని డీజీపీ శివధర్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. జర్నలిస్టులు ఏం క్రిమినల్స్ కాదు టెర్రరిస్టులు కాదు? వారిపట్ల ఎందుకు అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అడిగారు. 
అర్ధరాత్రి సమయంలో విమానాశ్రయంలో ముగ్గురు ఎన్‌టీవీ జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన నేరుగా, ప్రమాదకరమైన దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని, అలాగే వారి “ఇందిరమ్మ రాజ్యం” ఎంత భయంకరంగా ఉందో బయటపెడుతోందని ధ్వజమెత్తారు.