ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కెనడా 40 ఏళ్లుగా విఫలం

ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కెనడా 40 ఏళ్లుగా విఫలం
ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కెనడా 40 ఏళ్లుగా విఫలమవుతూనే ఉందని ఆ దేశ భారత హైకమిషనర్‌ దినేశ్‌ పట్నాయక్‌ విచారం వ్యక్తం చేశారు. అందువల్లే భారత్‌ వ్యతిరేక కుట్రలకు ఒట్టావా కేంద్రంగా మారుతోందని విమర్శించారు. ఓ స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడిన దినేశ్‌ పట్నాయక్‌, ఎయిర్​ఇండియా బాంబు దాడి కేసులో ఇప్పటివరకు దర్యాప్తు కొలిక్కి రాలేదని, ఇది కెనడా అసమర్థతకు నిదర్శమని ఎద్దేవా చేశారు. 
కెనడా ప్రభుత్వ మద్దతుగల ప్రసార సంస్థ సిబిసికి ఇచ్చిన ఘాటు పదాలతో కూడిన, కొన్నిసార్లు ఘర్షణాత్మకమైన ఇంటర్వ్యూలో, ఒట్టావా సుదీర్ఘ నిష్క్రియాత్మకత భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదం, హింసకు అనుమతించే వాతావరణాన్ని సృష్టించిందని ఆయన ఆరోపించారు.  ఈ సందర్భంగా ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ ఏజెంట్ల ప్రమేయం ఉందన్న ఆరోపణలను దినేశ్‌ తీవ్రంగా ఖండించారు.
ఆధారాలు చూపకుండా భారత్‌పై నిందలు వేయడం సరికాదని హితవు చెప్పారు.  “కెనడా గడ్డ నుంచి జరుగుతోన్న ఉగ్ర కుట్రల గురించి మేం 40 ఏళ్లుగా చెబుతున్నాం. ఉగ్రవాద కట్టడికి ఈ దేశ నేతలెవరైనా చర్యలు చేపట్టారా? ఎయిర్​ఇండియాపై బాంబు దాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ కేసుల్లో కనీసం ఒక్కరికైనా శిక్ష పడిందా? కెనడా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది” అంటూ మండిపడ్డారు. 
 
“ఉగ్రవాదుల గురించి భారత్‌ లేవనెత్తినప్పుడు ఆధారాలు కావాలని డిమాండ్ చేస్తోంది. మరి మా దేశంపై కెనడా ఆరోపణలు చేసినప్పుడు కూడా (నిజ్జర్ హత్య కేసు విషయంలో) ఆధారాలు చూపించాలి కదా! ఆరోపణలు చేయడం సులువే. ఆ ఘటనలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని చెప్పేందుకు కచ్చితమైన సమాచారం ఉందని కెనడా పదే పదే చెబుతోంది. మరి అందుకు తగిన ఆధారాలెక్కడ?” అని దినేష్ పట్నాయక్ ప్రశ్నించారు.

నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడాలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదైందని, ఇప్పటివరకు భారత ప్రభుత్వంపై ఎలాంటి అభియోగాలు లేవని దినేశ్‌ పట్నాయక్ స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. మరోవైపు, భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై కెనడా ప్రయత్నిస్తున్న తరుణంలో దినేశ్‌ పట్నాయక్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.