జమ్ము-కాశ్మీర్ లో పాకిస్తాన్ నుంచి వచ్చిన అనుమానాస్పద బెలూన్ కలకలం రేపింది. ఎరుపు రంగులో, హార్ట్ షేపులో ఉన్న బెలూన్ కథువా జిల్లా పరిధి, పహర్ పూర్ ప్రాంతంలో భద్రతా బలగాలు సోమవారం స్వాధీనం చేసుకున్నాయి. పహర్ పూర్ ప్రాంతం భారత సరిహద్దులో ఉంటుంది. ఈ బెలూన్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భద్రత గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకుముందు అర్నియా ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక బెలూన్ ను ఇటీవల అధికారుల స్వాధీనం చేసుకున్నారు. ఈ బెలూన్ కనిపించిన నేపథ్యంలో పోలీసులు అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎందుకు వచ్చింది అనే విషయాల్ని భద్రతా దళాలు విశ్లేషిస్తున్నాయి.
ఆదివారం పాక్-భారత్ సరిహద్దు అయిన ఎల్వోసీలో, నౌషేరా-రాజౌరి సెక్టార్ వద్ద కొన్ని డ్రోన్లు అనుమానాస్పదంగా ఎగురుతూ కనిపించాయి. వాటిని గుర్తించిన భారత సైన్యం కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. దీంతో ఆ డ్రోన్లు తిరిగి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ భద్రతను మరింత పెంచారు. భద్రతా సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల ఎలాంటి డ్రోన్ ఇటువైపు రాలేదని స్థానికులు అంటున్నారు.
మరోవైపు తాజాగా వస్తున్న బెలూన్ల ద్వారా ఏమైనా ఆయుధాలు, డ్రగ్స్ వంటివి పాక్ నుంచి ఇండియాకు పంపిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ అంశంపై అక్కడ భద్రతా విభాగం గట్టి నిఘా పెట్టింది. ఉన్నతాధికారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవంక, కేరీ సెక్టార్కు చెందిన దూంగా గలీ ప్రాంతంలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి మంగళవారం అనేక డ్రోన్లు ఎగురుతూ కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
డ్రోన్లను కూల్చివేసేందుకు వాటిపై కాల్పులు జరిపిన భద్రతా దళాలు డ్రోన్ల ద్వారా ఆయుధాల చేరవేత జరిగిందా? అన్న కోణంలో గాలింపు చేపట్టాయి. గడచిన 48 గంటల్లో రాజౌరీ సెక్టార్లో ఇటువంటి సంఘటన జరగడం ఇది రెండవసారి. పెద్ద సంఖ్యలో డ్రోన్ల కదలికలపై ఆందోళన చెందిన సైనిక దళాలు ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి విస్తృతంగా తనిఖీలు చేపట్టి నిఘాను పెంచాయి.
గత ఏడాది మేలో ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎల్వోసీ, ఐబీ వెంబడి పెద్ద సంఖ్యలో డ్రోన్లు సంచరించడం ఇదే మొదటిసారి. ఆదివారం రాజౌరీ సెక్టార్లో అనేక డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి.

More Stories
ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందే
సెక్షన్ 17ఎ నిబంధన చట్టబద్ధతపై సుప్రీంలో భిన్నాభిప్రాయాలు
భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక క్షిపణి