10 నిమిషాల్లో డెలివరీ నిబంధన విషయంలో గిగ్ వర్కర్లకు ఊరట లభించింది. కేంద్ర కార్మిక శాఖ జోక్యంతో ఈ కామర్స్ సంస్థలు వెనక్కి తగ్గాయి. ఇకపై 10 నిమిషాల డెలివరీ విధానాన్ని నిలిపివేయడానికి బ్లింకిట్ లాంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గిగ్ కార్మికుల రక్షణ, భద్రత, మెరుగైన పని పరిస్థితులను కల్పించే లక్ష్యంతో కేంద్రం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ 10 నిమిషాల్లో డెలివరీ ఇస్తామన్న హామీని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి మనుసుక్ మాండవీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన ప్రతినిధులతో సమావేశమై తాజా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ డెలివరీ పార్ట్‌నర్స్ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ-కామర్స్ ప్రతినిధులకు సూచించినట్లు తెలిసింది.
ఇప్పటికే బ్లింకెంట్ కంపెనీ పది నిమిషాల డెలివరీ డెడ్ లైన్ నిబంధనను తొలగించింది. 30 వేల ప్లస్ ఉత్పత్తులకు బదులు పది నిమిషాల్లో పది వేల ప్లస్ ప్రొడక్ట్స్ మీ ఇంటి వద్దకే అనే తన ట్యాగ్‌లైన్‌ను సవరించింది. ఈ వరుసలో పలు ప్లాట్‌ఫామ్స్‌లు ఉన్నాయని తెలుస్తోంది. బహుశా కొద్దిరోజుల్లో ప్రముఖ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు కూడా నిబంధనల్ని సవరించే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే గిగ్ వర్కరక్లు భద్రత, రక్షణ, మెరుగైన పని పరిస్థితుల్ని కల్పించే దిశగా ఈ ప్లాట్‌ఫామ్‌లు చర్యలు చేపట్టేందుకు సిద్ధపడ్డాయని మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఆప్ ఎంపి రాఘవ్ చద్దా మాట్లాడుతూ గిగ్‌వర్కర్లు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని, వాతావరణ అననుకూల పరిస్థితుల్లో కూడా వారు ప్రొడక్ట్స్‌ని డెలవరీ చేస్తున్నారనే అంశాలను ఆయన పార్లమెంటులో చర్చించారు.
గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతా ప్రయోజనాలు, రక్షణ, గౌరవం, న్యాయమైన వేతనం అందించాలనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో ప్రముఖ డెలివరీ కంపెనీలు డెలివరీ 10 మినిట్స్ డెడ్ లైన్‌ను తొలగించడంపై మంగళవారం రాఘవ్‌చద్దా హర్షం వ్యక్తం చేశారు. ‘సత్యమేవ జయతే.. కలిసికట్టుగా జయించాం’ అని తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
క్విక్ డెలివరీలను తీసేయాలని గిగ్ వర్కర్లు ఇటీవల దేశవ్యాప్త సమ్మె కూడా చేశారు. డిసెంబర్ 25, 31న గిగ్ వర్కర్ల యూనియన్లు మెరుగైన జీతం, సామాజిక భద్రతా ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించాయి. వారి డిమాండ్లలో 10 నిమిషాల డెలివరీ కూడా ఉంది. ఇదిలా ఉండగా, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లలో కొన్ని నిబంధనలు పొందుపరిచింది.
అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్‌లో 1-2% (కార్మికులకు చెల్లించే మొత్తంలో 5% వరకు) సామాజిక భద్రత నిధికి కేటాయించడం తప్పనిసరి చేసింది. దీంతో పాటు వారికి ఆరోగ్య, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించింది. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే కనీసం 90 రోజు పాటు ఒక అగ్రిగేటర్తో పని చేసి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పని చేస్తుంటే 120 రోజులు ఉండాలి. 2025 డిసెంబర్ 30న ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది.

More Stories
పేరు ప్రజాస్వామ్యం: సాగుతున్నది వారసత్వాల యుద్ధం
బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలతో చైనా కమ్యూనిస్టు నేతల భేటీలు
పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక చర్య తప్పదు