బంగ్లా పోలీసు కస్టడీలో ఓ హిందూ నేత మృతి.. ఆటో డ్రైవర్ హత్య

బంగ్లా పోలీసు కస్టడీలో ఓ హిందూ నేత మృతి.. ఆటో డ్రైవర్ హత్య
మైనారిటీలపై దాడులతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ లో మరో ఇద్దరు హిందువులు ప్రాణాలు కోల్పోయారు. అవామీ లీగ్ అనే హిందూ సంస్థకు చెందిన హిందూ నాయకుడు, ప్రముఖ సంగీత కారుడు అయిన ప్రొలోయ్ చాకి (60) ఆదివారం సాయంత్రం పోలీసు కస్టడీలో కన్నుమూశాడు. మరోవంక, ఫెని జిల్లాలోని దగనూయాన్ ప్రాంతంలో సమీర్ కుమార్ దాస్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు.
 
ప్రొలోయ్ షేక్ హసీనా ప్రభుత్వంలో కల్చరల్ ఎఫైర్స్ విభాగంలో కార్యదర్శిగా పని చేశాడు.  పబ్నా ప్రాంతం, పతర్తాలాలోని తన నివాసం నుంచి గత డిసెంబర్ 16న ప్రొలోయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024లో జరిగిన ఒక బాంబు పేలుడు కేసుకు సంబంధించి అతడిని అరెస్టు చేశారు. అక్కడి పోలీసుల కథనం ప్రకారం ప్రొలోయ్ కు మధుమేహం సహా అనేక ఆరోగ్య సమస్యలున్నాయి. 
ఈ క్రమంలో జైలులో ఉన్న అతడు శుక్రవారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మొదట స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం రాజ్ షాహి మెడికల్ హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా.. ఆదివారం రాత్రి ప్రొలోయ్ మరణించాడు.  కాగా,  ప్రొలోయ్ మరణంపై అతడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే అతడు మరణించినట్లు చెప్పారు.
తన తండ్రికి గుండె సమస్య ఉందని, అయినప్పటికీ తగిన చికిత్స అందించడంలో పోలీసులు విఫలమయ్యారని అతడి కొడుకు సని చాకి ఆరోపించారు. తన తండ్రి ఆరోగ్య స్తితిపై పోలీసులు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని చెప్పారు.  అయితే, వారి ఆరోపణలను పోలీసులు ఖండించారు. తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, తమ సేవల్లో ఎలాంటి లోపం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనపై ఇప్పటివరకు స్పష్టమైన విచారణ ఏదీ జరగలేదు. దీనిపై అక్కడి మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసు కస్టడీలో మరణించిన వారిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి.
 
కాగా, ఫెని జిల్లా దగనూయాన్ ఉప జిల్లాలో నివసిస్తున్న 29 ఏళ్ల సమీర్ కుమార్ దాస్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అతడిని దారుణంగా కొట్టి చంపారు. రక్తపు మడుగులో ఉన్న సమీర్ మృతదేహాన్ని ఒక ఆసుపత్రి వెలుపల గుర్తించడం తీవ్ర కలకలం రేపింది.  ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం, దుండగులు అతడిని తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశారు.
గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో హిందూ వర్గాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో ఈ హత్య జరగడం అక్కడి హిందువులలో భయాందోళనలను మరింత పెంచింది. ఈ కేసును విచారిస్తున్న స్థానిక పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.  సాధారణంగా దోపిడీ దొంగతనాలు జరిగినప్పుడు నగదు లేదా విలువైన వస్తువులను తీసుకెళ్తారు. అయితే, సమీర్ మృతదేహం వద్దే అతని మొబైల్ ఫోన్, మెడలోని బంగారు గొలుసు, మరియు జేబులోని డబ్బు అలాగే ఉన్నాయి. 
కేవలం అతను నడుపుతున్న ఆటోను మాత్రమే దుండగులు తీసుకెళ్లారు. దీనిని బట్టి చూస్తే, ఇది కేవలం దోపిడీ కోసం చేసిన హత్య కాదని, ఒక పక్కా పథకం ప్రకారం అతడిని లక్ష్యంగా చేసుకొని చేసిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. సమీర్ ఆటోను పక్కదారి పట్టించడానికి లేదా ఆధారాలను మాయం చేయడానికి తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు.