నెలాఖరు లోగా కొత్త కార్యాలయంలోకి ప్ర‌ధాని మోదీ!

నెలాఖరు లోగా కొత్త కార్యాలయంలోకి ప్ర‌ధాని మోదీ!

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ‌చ్చే నెలలో కొత్త కార్యాలయంలో అడుగుపెట్ట‌నున్నారు. రైసినా హిల్స్‌లో ఆయ‌న కోసం కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.  ప్ర‌ధాని కార్యాల‌య నిర్మాణం చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ది. ఈనెల చివ‌రి నుంచే ఆయ‌న ఆ ఆఫీసు నుంచి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొత్త పీఎంవో దాదాపు పూర్తి అయిన‌ట్లు కొన్ని అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. కొత్త పీఎంవో ప్రారంభం కోసం రెండు ముహూర్తాల‌ను నిర్ణయించినట్లు చెబుతున్నారు.

వాటిల్లో ఏదో ఓ ముహూర్తంలో కార్యాలయాన్ని అక్కడకు మార్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అధికార వ‌ర్గాల ద్వారా వెల్ల‌డైంది.  వీలైతే జ‌న‌వ‌రి 14వ తేదీన అంటే మ‌క‌ర సంక్రాంతి రోజున కొత్త ఆఫీసులోకి అడుగుపెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. లేదంటే జ‌న‌వ‌రి 19 నుంచి 27వ తేదీ మ‌ధ్య కొత్త ఆఫీసులోకి ప్ర‌వేశించే ఛాన్సు ఉన్న‌ది. ఒక‌వేళ అప్ప‌టికీ ప‌నులు పూర్తి కాకుంటే ఫిబ్ర‌వ‌రిలో క‌చ్చితంగా కొత్త ఆఫీసు ప్రారంభం కానున్న‌ది.

ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం పేరును మార్చిన విష‌యం తెలిసిందే. కొత్త పీఎంవో నిర్మాణ ద‌శ‌లో దాన్ని ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ అని పేరు పెట్టారు. ఆ త‌ర్వాత దాన్ని సేవా తీర్థ్‌గా మార్చారు. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని, ఉపాధ్య‌క్షుడి ఎన్‌క్లేవ్‌ను ఇప్ప‌టికే ప్రారంభించారు.  కేంద్ర మంత్రులకు చెందిన 8 భవనాలలో మూడింటిని ఇప్ప‌టికే పూర్తి చేశారు. పీఎంవో లేఅవుట్‌లో సేవా తీర్థ్‌-1, సేవా తీర్థ్‌-2, సేవా తీర్థ్‌-3 ఉన్నాయి. సేవా తీర్థ్‌-1లో పీఎంవో హౌజ్‌, సేవా తీర్థ్‌-2లో క్యాబినెట్ సెక్ర‌టేరియేట్ హౌజ్‌, సేవా తీర్థ్‌-3లో ఎన్ఎస్సీ సెక్ర‌టేరియేట్ హౌజ్‌తో పాటు నేష‌న‌ల్ సెక్యూర్టీ అడ్వైజ‌ర్ అజిత్ ధోవ‌ల్ ఆఫీసు ఉంటాయి.