తనను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ 

తనను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తనను తాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వికీపీడియా పేజిని పోలినట్లుగా ఉన్న ఎడిటెడ్ ఫొటోను ట్రంప్ పోస్టు చేశారు.  అందులో డోనాల్డ్ ట్రంప్ ఫొటో కింద వెనెజువెలా యాక్టింగ్ ప్రెసిడెంట్ అని రాసి ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లుగా ఉంది. 

అలాగే తనను అమెరికా 45వ, 47వ అధ్యక్షుడిగా, 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరించినట్లు కూడా పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.  అమెరికా – వెనెజువెలా మధ్య పరిస్థితులు తీవ్రంగా మారిన సంగతి తెలిసిందే. మాదకద్రవ్యాల అక్రమ రవాణా అడ్డుకట్ట పేరుతో అమెరికా వెనెజువెలాపై భారీ స్థాయి దాడులు చేపట్టింది. రాజధాని కారకాస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన అమెరికా బలగాలు, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అరెస్ట్ చేశాయి. 

అనంతరం వారిని న్యూయార్క్‌కు తరలించి నార్కో టెర్రరిజం కేసుల్లో అభియోగాలు నమోదు చేశారు.  ఈ సైనిక చర్య అనంతరం వెనెజువెలాలో సురక్షితంగా ఉండేంత వరకు తామే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. దీంతో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న డెల్సీ రెడ్రిగ్జో యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.  ఆమె 90 రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని వెనెజువెలా రక్షణ మంత్రి ప్రకటించారు

అయితే ఆమె తమకు నచ్చినట్లుగా వ్యవహరించాలని, లేదంటే మదురో కంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అప్పట్లో ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, వెనెజువెలా ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ పోస్టు రాజకీయంగా సంచలనంగా మారింది.  అలాగే వెనెజువెలా తాత్కాలిక ప్రభుత్వం అమెరికాకు 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల అధిక నాణ్యత గల చమురును అందజేస్తుందని ట్రంప్ వెల్లడించారు. 

ఈ చమురును అంతర్జాతీయ మార్కెట్ ధరలకే విక్రయిస్తామని చెప్పారు. ఆ డబ్బును తానే నియంత్రిస్తానని, అమెరికా, వెనెజువెలా దేశాల ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.