కరాటే, యుద్ధకళల పట్ల ఆసక్తి కలిగిన పవర్ స్టార్ చెన్నైలో ఉండగానే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేశారు. శారీరక సాధనకే పరిమితం కాకుండా, జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి, పరిశోధించి వాటిని అనుసరించారు. పలు సినిమాల్లో మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ, వాటికి విస్తృత గుర్తింపు, ప్రజాదరణ తీసుకొచ్చారు.
జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ (ఐదో డాన్) పురస్కారం లభించింది. జపాన్ వెలుపల ‘సోకే మురమత్సు సెన్సై’లోని ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగానూ పవన్ ఘనత సాధించారు . గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే విశిష్ట బిరుదు అందించారు.
ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గదర్శకత్వంలో పవన్‌కల్యాణ్ ‘కెండో’లో సమగ్ర శిక్షణ పొంది, ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం పొందారు. సినిమా, శాస్త్రీయ యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రాలను అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
కాగా, అప్పుడెప్పుడో వచ్చిన జానీ సినిమా నుంచి ఇటీవలగా రిలీజైన ఓజీ దాకా అనేక సినిమాల్లో పవన్ తన మార్షన్ ఆర్ట్స్ ప్రతిభను ప్రదర్శించారు. హీరోగానే కాకుండా సింగర్, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్ ఇలా అనేక విభాగాల్లో పవన్ ప్రతిభ చాటుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించి ఆయన 30ఏళ్ల ప్రయాణంపై ఓ వీడియో కూడా విడుదల చేశారు.

More Stories
పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగంలో అంతరాయం
బాలికల విద్య దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది
`అన్వేష్’ ఉపగ్రహం రేపే నింగిలోకి ప్రయోగం