వేలాది మంది సూసైడ్ బాంబర్లు అజర్ ఉగ్ర హెచ్చరికలు

వేలాది మంది సూసైడ్ బాంబర్లు అజర్ ఉగ్ర హెచ్చరికలు
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ పేరుతో ఉన్న ఒక ఆడియో రికార్డింగ్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. భారత్‌పై దాడులు చేయడానికి వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని ఈ ఆడియోలో అతడు హెచ్చరించడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. 
ఆ ఆడియోలో మసూద్ అజర్ భారత్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒకరు, ఇద్దరు కాదు.. వందల్లో కూడా కాదు.. వెయ్యి కంటే ఎక్కువే ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని పేర్కొన్నాడు. తాను గనుక పూర్తి సంఖ్యను వెల్లడిస్తే రేపు అంతర్జాతీయ మీడియాలో పెద్ద దుమారం రేగుతుందని చెప్పుకొచ్చాడు.
 
“ఈ ఫిదాయీలు కేవలం అమరవీరులు కావాలని కోరుకుంటున్నారు. వారికి అందమైన భార్య గానీ, అమెరికా లేదా ఐరోపా వీసా గానీ, ఐఫోన్ గానీ వద్దు. వారు అల్లాహ్‌ను కేవలం ఒక్కటే కోరుకుంటున్నారు: అమరవీరత్వం. వారు నన్ను బెదిరిస్తూ, తమను పంపమని అడుగుతున్నారు. ఈ ఆత్మాహుతి బాంబర్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, కనీసం 1,000 మంది కూడా కాదు. నేను మీకు పూర్తి సంఖ్య చెబితే, రేపు ప్రపంచ మీడియాలో కలకలం రేగుతుంది,” అని ఆ ఆడియో రికార్డింగ్‌లో వినిపించింది.
 
భారత్‌లోకి చొరబడి దాడులు చేయడానికి తన అనుచరులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని, వారు రక్తపాతానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఆడియోలో మసూద్ అజార్ చెబుతున్నట్లుగా వినిపించింది. అయితే ఈ ఆడియో ఎప్పుడు రికార్డ్ అయిందనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. గతేడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత దళాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయి.
 
అందులో భాగంగా పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేశాయి. ఇందులో మసూద్ అజర్ సన్నిహితులు, బంధువులు మొత్తం 11 మంది హతం అయ్యారు. దానికి ప్రతీకారంగానే ఈ తాజా హెచ్చరికలు వచ్చినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
 
ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మృతి చెందిన మారణకాండ వెనుక కూడా జైషే మహ్మద్ హస్తం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో పట్టుబడ్డ ఉమర్ మహమ్మద్ అనే నిందితుడికి జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. . అతడు 2001లో భారత్ పార్లమెంటుపై జరిగిన దాడికి, అలాగే 2008 ముంబై దాడులకు సూత్రధారి. జైషే మహ్మద్ సంస్థను నడిపిస్తున్నాడు.  
 
2019 తర్వాత మసూద్ అజర్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. 2019లో బహవల్పూర్‌లో అతని స్థావరంపై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన భారీ పేలుడులో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి అతను రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నాడు. పాకిస్తాన్ గడ్డపై నుంచే మసూద్ అజార్ భారత్‌పై దాడులకు వ్యూహరచన చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
 
మరోవంక, లష్కరే తోయిబా ప్రధాన నాయకుడు, పహల్గామ్ దాడి మాస్టర్‌ మైండ్ సైఫుల్లా కసూరి, భారతదేశం తన ఉనికి కారణంగా భయపడుతోందని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కశ్మీర్ మిషన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు. “పాక్ ఆర్మీ నన్ను స్వయంగా ఆహ్వానిస్తుంది. యుద్ధంలో చనిపోయిన సైనికులకు అంత్యక్రియలు నేనే నిర్వహిస్తాను” అని పేర్కొన్నాడు. పహల్గామ్ దాడి తర్వాత తన పేరు అంతర్జాతీయంగా గుర్తింపును పొందిందని, ఇది అతని ప్రోఫైల్ పెంపుకు దారితీసిందని వెల్లడించాడు.