భారతదేశంలో ఉపాధి హామీ పథకాలు 1960ల నుంచే అమలులో ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా వచ్చిన ప్రతి పథకమూ నిర్మాణాత్మక లోపాలు, లీకేజీలు, అవినీతితో బారిన పడి పేద ప్రజలకు అన్యాయం జరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ఈ లోపాలను సరిదిద్దేందుకే పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన ఆధునిక సాంకేతికతతో విబి-జి రామ్ జి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు.
బిజెపి కిషన్ మోర్చా ఆధ్వర్యంలో విబి-జి రామ్ జి చట్టంపై జరిగిన వర్క్ షాప్ లో మాట్లాడుతూ మారుతున్న ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా పాత సంక్షేమ మోడళ్లలో మార్పులు అవసరమని, అందుకే విబి-జి రామ్ జి అవసరమే కాకుండా అనివార్యమని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ పేరుపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న మక్కువపై ఆయన ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ లేదా ఇందిరా గాంధీ పేర్లకు బదులుగా హైదరాబాద్ విమానాశ్రయానికి మహాత్మా గాంధీ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.
ఎన్ఆర్ఈజిఎ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 100 శాతం అన్‌స్కిల్డ్ వేతనాలను భరించడం వల్ల, రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత లేకుండా వ్యవహరించాయని, వేతనాల కృత్రిమ పెంపు, భారీ లీకేజీలు చోటుచేసుకున్నాయని రావు ధ్వజమెత్తారు. దానికి భిన్నంగా విబి-జి రామ్ జి చట్టం 60:40 నిధుల భాగస్వామ్య మోడల్‌ను ప్రవేశపెడుతుందని, దీని ద్వారా రాష్ట్రాల బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ, జవాబుదారీతనం పెరుగుతాయని తెలిపారు.
యుపిఎ పాలన కాలంలో
ఎంజిఎన్ఆర్ఈజిఎ కింద జరిగిన కుంభకోణాలపై డాక్యుమెంటెడ్ ఉదాహరణలను కూడా ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్‌లో (2011) నకిలీ జాబ్ కార్డులు, కల్పిత పనులు, లేనిపోని వ్యక్తులకు చెల్లింపుల ద్వారా రూ.10,000 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని చెప్పారు. అలాగే ఒడిశా సంబల్పూర్ జిల్లాలో (2012) మరణించినవారికి, పని చేయలేని వారికి, పెన్షనర్లకు వేతనాలు చూపించడం, నకిలీ పని దినాలు, డూప్లికేట్ బిల్లులు వంటి అవకతవకలు జరిగాయని వివరించారు. విబి-జి రామ్ జి చట్టం ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125 రోజులకు పెంపు, కనీసం 50 శాతం పనులు గ్రామ పంచాయతీల ద్వారా అమలు, గ్రామసభలు, గ్రామ పంచాయతీలు గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం, నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల నిర్మాణం, జీవనోపాధి ఆధారిత పనులు, విపత్తు నిర్వహణపై ప్రధానంగా దృష్టి పెట్టడం అని తెలిపారు.అలాగే తప్పనిసరి బయోమెట్రిక్ ధృవీకరణ, జిపిఎస్-శాటిలైట్ మానిటరింగ్, ఎఐ ఆధారిత మోసాల గుర్తింపు, వారానికొకసారి ప్రజా ప్రకటనలు వంటి చర్యలతో లీకేజీలకు పూర్తిగా చెక్ పెడతామని స్పష్టం చేశారు.

More Stories
కట్టమైసమ్మ దేవి ఆలయం సమీపంలో మలవిసర్జనతో ఉద్రిక్తత
సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక
రాజా సాబ్ చిత్రం టికెట్ ధరల పెంపు జీవో కొట్టివేత