ముంబై నగరపాలిక అయిన బీఎంసీ ఎన్నికలు ఈ నెల 15న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ముంబై వాసులకు ఎన్నికల వరాలు కురిపించింది. బీజేపీ, ఎన్సీపీ, శివసేన (షిండే) పార్టీలతో కూడిన ఈ కూటమి తాము ఎన్నికల్లో గెలిచి, ముంబై పీఠాన్ని అధిరోహిస్తే మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామని ప్రకటించింది.
రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలివ్వనున్నట్లు వెల్లడించింది. మేనిఫెస్టోకు “మహాయుతి వచన నామ” అని పేరు పెట్టారు. అంతేకాదు.. మురికివాడలు లేని నగరంగా ముంబైని తీర్చిదిద్దుతామని తెలిపింది. ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సహా పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ముంబై అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, తాము కచ్చితంగా హిందుత్వకు కట్టబడ్డామని, అయితే, అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు సహా అక్రమ వలసదారుల్ని తరిమేస్తామన్నారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీ వాడుతామని తెలిపారు.
ముంబైలోని మురికి వాడల్ని అభివృద్ధి చేస్తామని, మరాఠీలు తిరిగి వచ్చేలా చూస్తామని, పాత పగ్డి బిల్డింగులను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్ధవ్ థాక్రే వర్గం అభివృద్ధి గురించి మాట్లాడరని తెలిపారు. రాబోయే ఐదేళ్ల పాటు నీటి పన్ను (నీటి ఛార్జీలు) పెంపుపై నిషేధం విధిస్తామని, రాబోయే ఐదేళ్లలో గార్గాయ్, పింజల్, దమన్‌గంగా ప్రాజెక్టులను పూర్తి చేసి ముంబైకి నీటి సరఫరాను పెంచుతామని తెలిపారు.
చిన్న పరిశ్రమల విధానాన్ని అమలు చేయడం, పునరాభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడం; ముంబైని పగడీ రహితంగా మార్చడానికి, ఫన్నెల్ జోన్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన ప్రకటించిన పథకాలను వేగంగా అమలు చేయడం, 2029 నాటికి బెస్ట్ బస్సులు పూర్తిగా విద్యుత్ బస్సులుగా మార్చడం, బెస్ట్ బస్సులలో మహిళా ప్రయాణికులకు 50 శాతం రాయితీ,బెస్ట్ బస్సుల సంఖ్యను 5,000 నుండి 10,000కి పెంచడం వంటి హామీలు ఇచ్చారు.
‘లడ్కీ బహెన్’ లబ్ధిదారులను స్వయం సమృద్ధిగా మార్చడానికి, చిన్న వ్యాపారాలను స్థాపించడానికి సహాయపడటానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ముంబైని రోహింగ్యా మరియు బంగ్లాదేశీ అక్రమ వలసదారుల నుండి విముక్తం చేయడం, పర్యావరణ పరిరక్షణ పథకాల కింద రూ. 17,000 కోట్లు కేటాయింపు, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక పర్యాటక శాఖను ఏర్పాటు చేయడం చేస్తామని వివరించారు.

More Stories
ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా భారత్ లో మాత్రం స్థిరత్వం
కేరళలో ఈ సారి కచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి
28 వేల పరుగుల క్లబ్లో విరాట్ కోహ్లీ