28 వేల పరుగుల క్లబ్‌లో విరాట్ కోహ్లీ

28 వేల పరుగుల క్లబ్‌లో విరాట్ కోహ్లీ
ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడైన అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఘనత సాధించాడు. ఈమధ్య వన్డేల్లో వరుస సెంచరీలతో రికార్డులు నెలకొల్పిన విరాట్ ఈసారి 28 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. వడోదరలో న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ మైలురాయికి చేరుకున్నాడు. తద్వారా ఈ అరుదైన క్లబ్‌లో చేరిన మూడో ఆటగాడిగా అవతరించాడు కోహ్లీ.
 
ఈమధ్యే స్వదేశంలో దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు శతకాలతో వన్డేల్లో తనకు తానే సాటి అని నిరూపించిన అతడు  28వేల పరుగులు సాధించాడు. అతడికంటే ముందు భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర(శ్రీలంక దిగ్గజం) మాత్రమే 28వేల పరుగులు పూర్తి చేసుకున్నారు.  అయితే కోహ్లీ 624 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సొంతం చేసుకోగా, సచిన్‌ 644 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అంటే మాస్టర్ బ్లాస్టర్ కంటే20 ఇన్నింగ్స్‌ల కంటే ముందే విరాట్ ఈ క్లబ్‌లో చేరాడు. శ్రీలంక వెటరన్ సంగక్కరకు 666 ఇన్నింగ్స్‌ల్లో 28 వేల రన్స్ సాధించాడు.
 
మరోవంక, తన కెరీర్లో ఇది విరాట్కు 309వ వన్డే మ్యాచ్. దీంతో భారత్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించిన ఐదో క్రికెటర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ (308 మ్యాచ్లు)ని అధిగమించాడు. కాగా, ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్ తెందూల్కర్ టాప్లో ఉన్నాడు. సుదీర్ఘ కెరీర్లో సచిన్ భారత్ తరఫున 463 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 400 వన్డే మ్యాచ్లు ఆడిన ఏకైక భారత క్రికెటర్గానూ సచిన్ పేరిట రికార్డ్ ఉంది.
 
కాగా, ఆఖరి వరకూ ఉత్కంఠ రేపిన వడోదర వన్డేలో భారత జట్టునే విజయం వరించింది. ఛేదనలో విరాట్ కోహ్లీ(93), శుభ్‌మన్ గిల్(56) అర్ధ శతకాలతో అలవోకగా గెలుస్తుందనుకున్న టీమిండియా.. కైలీ జేమీసన్ (4-41) తన ఆఖరి స్పెల్‌లో మూడు వికెట్లు తీయడంతో కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్(49)ను బౌల్డ్ అయ్యాక కేఎల్ రాహుల్(29 నాటౌట్) ఒత్తిడిలోనూ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. 
 
కాలి గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్(7 నాటౌట్) సాయంతో జట్టును గెలిపించాడు రాహుల్. క్లార్క్ వేసిన 49వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, సిక్సర్‌తో టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. దాంతో, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.