స్వాతంత్ర్యం తర్వాత గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయని చెబుతూ వారిని ఎదుర్కోవడానికి భారతదేశం అప్రమత్తంగా, ఐక్యంగా మరియు బలంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హెచ్చరించారు. 1026లో మహమూద్ గజనీ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ ఆలయ చరిత్ర విధ్వంసం లేదా ఓటమికి సంబంధించినది కాదని, విజయం, పునరుజ్జీవనానికి సంబంధించినదని తెలిపారు.
“సోమనాథ్ చరిత్ర విధ్వంసం, ఓటమికి సంబంధించినది కాదు, విజయం మరియు పునరుజ్జీవనానికి సంబంధించినది. ఇది కాలచక్రం, మతతత్వ దురాక్రమణదారులు ఇప్పుడు చరిత్ర పుటలకే పరిమితమయ్యారు, కానీ సోమనాథ్ ఆలయం మాత్రం నేటికీ సగర్వంగా నిలబడి ఉంది,” అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్రత్యానంతరం దేశ చరిత్రను చెరిపివేసేందుకు కొందరు కుట్రలు పన్నారని ఆరోపిస్తూ నిజమైన చరిత్రలోని హింస, ద్వేషం, ఉగ్రవాదాన్ని దాచిపెట్టి, సంపంద కోసం సోమనాథ్పై దాడి చేశారని చెప్పారని గుర్తు చేశారు.
సర్దార్ పటేల్ సోమనాథ్ ఆలయాన్ని పునర్ నిర్మించాలని అనుకుంటే చాలా మంది అడ్డుకున్నారని విమర్శించారు. వెయ్యేళ్ల క్రితం దురాక్రమణదారులు ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకున్నామని భావించారని, కానీ నేటికీ ఆలయంపై జెండా ఎగురుతుందని, ఇదే భారత శక్తి సామర్థ్యాలను, బలాన్ని ప్రపంచానికి చాటి చెపుతుందని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు సోమ్‌నాథ్‌లో స్వాభిమాన్ పర్వ్‌లో భాగంగా నిర్వహించిన శౌర్వ యాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పూలతో ఆలంకరించిన వాహనంలో యాత్రలో పాల్గొన్న ఆయన, మధ్యలో డమరుకం మోగించారు. ఇందులో ప్రధాని మోదీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సింఘ్వీ పాల్గొన్నారు. యాత్ర తర్వాత సోమ్‌నాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ శివునికి ప్రత్యేక పూజలు చేశారు.

More Stories
కట్టమైసమ్మ దేవి ఆలయం సమీపంలో మలవిసర్జనతో ఉద్రిక్తత
కేంద్రం హెచ్చరికతో 600 ఖాతాలను తొలగించిన ఎక్స్
అత్యాచారం కేసులో బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్