సిరియాపై అమెరికా ప్రతీకార దాడులు

సిరియాపై అమెరికా ప్రతీకార దాడులు
సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దళాలు భారీ దాడులు చేపట్టాయి. గత నెల ఐసిస్ జరిపిన దాడుల్లో తమ ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తమ పౌరులకు హాని తలపెట్టిన వారిని.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది. వారిని తాము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. వెతికి పట్టుకుని చంపేస్తామని యూఎస్ సెంట్రల్ కమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
 
స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆపరేషన్ హాక్‌ఐలో భాగంగా అమెరికా ఈ దాడులు చేసింది. 2025 డిసెంబర్ 13న సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు పాల్మిరా, సిరియాలో అమెరికా, సిరియా భద్రతా దళాలు లక్ష్యంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో పాటు అమెరికాకు చెందిన ట్రాన్స్‌లేటర్ మృతి చెందాడు. యూఎస్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. 
 
దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 19న ఆపరేషన్ హాక్‌ఐ పేరుతో ఐసిస్‌పై దాడులు నిర్వహించింది. జోర్డాన్‌తో కలిసి దాదాపు 70 ఐసిస్ స్థావరాలపై దాడులు చేసింది. తాజాగా అదే ఆపరేషన్‌కు కొనసాగింపుగా ప్రతీకార దాడులు నిర్వహించింది అమెరికా. కాగా, ప్రస్తుతం సిరియాలో దాదాపు 1000 మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. 
 
గత కొద్ది నెలలుగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు సిరియాలోని ఐసిస్ అనుమానితులపై గగనతల, భూతల దాడులు చేపడుతున్నాయి.
మరోవైపు, సిరియాలో దశాబ్ద కాలానికి పైగా సాగిన అంతర్యుద్ధం తర్వాత 2024లో మాజీ అధ్యక్షుడు బషర్ అసద్‌ను తిరుగుబాటుదారులు గద్దె దించారు. 5 దశాబ్దాల పాటు కొనసాగిన నిరంకుశ పాలనకు సిరియన్లు చరమగీతం పాడారు. నవశకానికి నాంది పలికారు. 
 
ఈ నేపథ్యంలో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా నాయకత్వంలో సిరియా ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల సిరియా కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టారు.  ఇది కేవలం కరెన్సీలో మాత్రమే కావని,  సిరియా జాతీయ అస్తిత్వానికి ప్రతీక అని అల్ షారా పేర్కొన్నారు.  
 
పాత కరెన్సీ నోట్లలో అసద్ కుటుంబ సభ్యుల చిత్రాలు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో చారిత్రక కట్టడాలు, గులాబీలు, గోధుమలు, ఆలివ్‌లు, నారింజలు, మల్బరీల వంటి వ్యవసాయ, ప్రకృతికి సంబంధించిన చిత్రాలతో డిజైన్ చేశారు. అయితే వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారని కానీ దేశం శాశ్వతమని ఇలా డిజైన్ చేసినట్లు అహ్మద్ అల్ షరా పేర్కొన్నారు.