అయోధ్య గుడిలో నమాజ్ చేసేందుకు విఫలయత్నం

అయోధ్య గుడిలో నమాజ్ చేసేందుకు విఫలయత్నం

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిర ప్రాంగణంలో భద్రతకు సంబంధించిన సున్నిత ఘటన చోటుచేసుకుంది. మందిరంలోకి ప్రవేశించిన ఓ కశ్మీర్‌ నివాసి నమాజ్‌ చేయడానికి ప్రయత్నించడంతో అక్కడి భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అయోధ్యలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఎస్‌పీ (సెక్యూరిటీ) బలరామాచారి దూబే తెలిపిన వివరాల ప్రకారం, కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా వాసి అబూ అహ్మద్‌ షేక్‌ (55) రామమందిర ప్రాంగణంలోకి గేట్‌ డి1 ద్వారా భక్తుడిగా నటిస్తూ ప్రవేశించాడు.

దర్శన మార్గంలో లోపలికి వెళ్లిన అనంతరం సీతా రసోయి సమీపంలో కూర్చొని నమాజ్‌ చేయడం ప్రారంభించాడు.  ప్రధాన ఆలయానికి కొన్ని వందల మీటర్ల దూరంలో అహ్మద్‌ షేక్‌ కింద బట్ట పరిచి, నమాజ్‌ చేసేందుకు ప్రయత్నించాడని అయోధ్య ఎస్‌ఎస్‌పీ గౌరవ్‌ గ్రోవర్‌ చెప్పారు. అహ్మద్‌తోపాటు మరో ఇద్దరు నినాదాలు చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ దృశ్యాన్ని గమనించిన భక్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్‌ విభాగాలు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అబూ అహ్మద్‌ షేక్‌ను భద్రతా ఏజెన్సీలు విచారిస్తున్నాయి. 

అయోధ్యకు ఎందుకు వచ్చాడు? రామమందిర ప్రాంగణంలోకి ప్రవేశించిన ఉద్దేశం ఏమిటి? దీని వెనుక ఏమైనా ముందస్తు ప్రణాళిక ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. అతని ప్రయాణ వివరాలు, ఎవరైనా ఇతరులు ఇందులో భాగస్వాములా అనే అంశాలనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక తనిఖీల్లో అతని వద్ద జీడిపప్పు, కిస్‌మిస్‌ వంటి వస్తువులు లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

విచారణలో అతడు తాను అజ్మీర్‌కు ప్రయాణిస్తున్నానని చెప్పినట్టు సమాచారం.ఈ ఘటన నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి మందిర ప్రాంగణంలో అన్ని ప్రవేశ ద్వారాల వద్ద వచ్చే, వెళ్లే భక్తుల తనిఖీలను మరింత కఠినతరం చేశారు. “ప్రవేశ ద్వారాల వద్ద అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పూర్తి స్థాయి విచారణ అనంతరం అసలు విషయం వెల్లడవుతుంది” అని ఎస్‌పీ బలరామాచారి దూబే తెలిపారు.