* ఇరాన్ నిరసనకారులకు ప్రవాస యువరాజు పిలుపు
ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ లో మహిళలు, యువత సహా మెజారిటీ ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అయితే, ఈ ఉద్యమం ఇప్పుడు కొత్త ట్రెండ్ లో నడుస్తోంది. చాలా మంది యువతులు సిగరెట్లు తాగుతూ, ఇరాన్ అధినేత అయతొల్లా ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
దీని ద్వారా ఖమేనీ పాలనలో తామెంత విసిగిపోయామో, ఆయనపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. ఇరాన్ లో 1989 నుంచి ఖమేనీ పాలనే కొనసాగుతోంది. ఆయన తన పాలనలో అక్కడి మహిళలపై తీవ్రమైన ఆంక్షలు విధించాడు. తమ ఆదేశాలు పాటించని మహిళలపై తీవ్ర చర్యలు తీసుకునేవాడు. వస్త్రధారణ, నైతిక అంశాల విషయంలో, మోరల్ పోలీసింగ్ పేరుతో చాలా మంది యువతులు, మహిళల్ని జైల్లో పెట్టి హింసించాడు.
2022లో మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని మోరల్ పోలీసింగ్ పేరుతో అరెస్టు చేసి, హింసించగా మరణించింది. అప్పట్నుంచి అక్కడి మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే, వాటిని ఖమేనీ నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు. ఇక కొంతకాలంగా ఇరాన్ ఆర్థిక పరిస్తితి దారుణంగా పతనమైంది. అక్కడి కరెన్సీ విలువ పడిపోవడం, నిత్యావసరాల ధరలు పెరగడం, అవినీతి, వేధింపులు, నిరుద్యోగం ఎక్కువ కావడంతో ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ యువత ఆందోళన బాటపట్టింది.
ముఖ్యంగా రెండు, మూడు వారాల నుంచి నిరసనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఖమేనీ పదవి నుంచి దిగిపోవాలంటే అక్కడి ప్రజలు కోరుతున్నారు. అవసరమైతే ఖమేనీని అంతం చేయాలని కూడా కోరుతున్నారు. ఇలాగే ఇరాన్ లో ఇస్లాం పాలన కంటే ముందు పాలించిన చివరి షా వారసుడు రెజా పహ్లావి పాలన కావాలంటూ అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. పోలీసులు ఎంతగా అణచివేస్తున్నా ఆందోళనలో ఆగడంలేదు.
ఇప్పటికే పదుల సంఖ్యలో పౌరులు మరణించారు. కొందరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆందోళనలో సాగుతూనే ఉన్నాయి. మహిళలు, యువత తమ బురఖాలు తీసేస్తూ.. ఆధునిక వస్త్రాలు ధరిస్తున్నారు. సిగరెట్లు కాలుస్తూ, ఖమేనీ ఫొటోల్ని కూడా కాల్చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఆందోళనలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే మరణ శిక్ష కూడా విధిస్తామని ఖమేనీ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలకు అమెరికా మద్దతు పలికింది.
ఇలా ఉండగా, దేశవ్యాప్తంగా సామూహిక తిరుగుబాటు చేయాలని ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లావీ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సిటీ సెంటర్లను ముట్టడించాలని, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో సమ్మెలు చేయాలని కోరారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను పతనం చేయడానికి వీధుల్లో నిరసనలు చేపట్టాలని సూచించారు. “ద్రోహి, క్రిమినల్ అయిన ఇస్లామిక్ రిపబ్లిక్ నేత బెదిరింపులకు దీటైన సమాధానం మీరంతా వీధుల్లోకి పెద్ద ఎత్తున రావడమే” అని వారి నిరసనలను ప్రశంసించారు. ఈ నిరసనలు చూసిన తర్వాత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ భయంతో వణికిపోతున్నారని చెప్పారు. ఇకపై నిరసనలు మరింత సునిశిత లక్ష్యంతో, విధ్వంసకరంగా జరగాలని కోరారు.
రవాణా, చమురు, గ్యాస్, ఎనర్జీ సహా ముఖ్యమైన రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెను ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడం వల్ల అసమ్మతిని అణచివేసే సామర్థ్యాన్ని ప్రభుత్వం కోల్పోతుందని చెప్పారు. వారాంతంలో మళ్లీ నిరసనలు చేపట్టాలని కోరారు. తాను కూడా స్వస్థలానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. జాతీయ విప్లవ విజయోత్సవ సమయానికి మీ పక్కనే ఉండే విధంగా వస్తానని చెప్పారు.

More Stories
కట్టమైసమ్మ దేవి ఆలయం సమీపంలో మలవిసర్జనతో ఉద్రిక్తత
సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇంకా ఉన్నాయి
కేంద్రం హెచ్చరికతో 600 ఖాతాలను తొలగించిన ఎక్స్