రామ మందిరానికి 15 కిమీ పరిధిలో మాంసాహారంపై ఆంక్షలు

రామ మందిరానికి 15 కిమీ పరిధిలో మాంసాహారంపై ఆంక్షలు
ఉత్తర్​ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర పరిసరాల్లో ఇకపై మాంసాహారం వాసన కూడా రాకూడదని జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. రామ మందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహార విక్రయాలతో పాటు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై కూడా పూర్తి నిషేధం విధించింది. మరోవైపు, బాలరాముడికి నిత్యం సమర్పించే నైవేద్యం, భక్తులకు పంచే ప్రసాదం నాణ్యతను పరీక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు.
ఆలయ వంటశాల ‘సీతా రసోయి’కి ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు.అయోధ్య పవిత్రతను కాపాడేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ‘పంచకోశి పరిక్రమ’ మార్గంలో ఇప్పటికే మాంసాహార విక్రయాలు నిలిపివేశారు. అయితే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఆన్‌లైన్ యాప్స్ ద్వారా రహస్యంగా నాన్-వెజ్ డెలివరీ చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్య చంద్ర సింగ్ సీరియస్ అయ్యారు. 
 
ఆన్‌లైన్ డెలివరీ కంపెనీలు కూడా ఆలయ పరిధిలో మాంసాహారాన్ని సరఫరా చేయకూడదని ఆదేశించారు. ఈ మేరకు హోటల్ యజమానులకు, డెలివరీ సంస్థలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మాంసాహారంతో పాటు మద్యపానంపై కూడా నిషేధం కొనసాగుతోంది. పంచకోశి పరిక్రమ మార్గంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు.
అయితే రామ్​పథ్ మార్గంలో ఇంకా దాదాపు రెండు డజన్ల లైసెన్స్ ఉన్న మద్యం షాపులు ఉన్నాయి. వీటిని తొలగించడానికి మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. జిల్లా యంత్రాంగం అనుమతి రాగానే వీటిని కూడా తొలగిస్తామని అధికారులు తెలిపారు.

మరోవైపు, రామయ్యకు పెట్టే నైవేద్యంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా, ప్రసాదం అత్యంత స్వచ్ఛంగా ఉండాలనేదే అధికారుల లక్ష్యం. ఆలయ వంటశాలలోని నైవేద్యం, ప్రసాదం నాణ్యతను పరీక్షించి సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఫుడ్ సేఫ్టీ విభాగం ఆడిట్ నిర్వహించనుంది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సర్టిఫికేట్ జారీ చేస్తారు.

ఆడిట్ బృందం సీతా రసోయిలో పలు అంశాలను పరిశీలిస్తుంది. వంటకు వాడే బియ్యం, నెయ్యి, పప్పులు వంటి సరుకుల నాణ్యతను పరీక్షిస్తారు. వంట గదిలో శుభ్రత, వంట పాత్రల క్లీనింగ్ విధానాన్ని గమనిస్తారు. సరుకులు నిల్వ చేసే గదులు ఎలా ఉన్నాయో చూస్తారు. వంట చేసే సిబ్బందికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? వారు ఫిట్‌గా ఉన్నారా లేదా? అని పరీక్షిస్తారు. వారు గ్లౌజులు, మాస్కులు వాడుతున్నారో లేదో తనిఖీ చేస్తారు.