బంగాల్ కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులను నిరసిస్తూ డిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ డిల్లీలోని కేంద్రహోం మంత్రి అమిత్ షా కార్యాలయం వద్ద టిఎయంసి ఎంపీలు నిరసనలు చేశారు. డెరెక్ ఓబ్రియెన్, మహువా మొయిత్రాతో సహా మరికొంత మంది ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులు పట్టుకొని అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బంగాల్ అసంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే దర్యాప్తు సంస్థలను కేంద్రం పంపుతోందని ఎంపీలు ఆరోపించారు. తప్పుడు పద్ధతిలో ఈడీ దాడులు చేస్తోందని ఆక్షేపించారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేస్తోన్న ప్రయత్నమని మండిపడ్డారు. ఈ విధంగా బీజేపీ ఎన్నికలలో గెలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసన చేస్తున్న ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే, నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఎంపీలలో డెరెక్ ఓ’బ్రియన్, శతాబ్ది రాయ్, మహువా మొయిత్రా, బాపీ హల్దార్, సాకేత్ గోఖలే, ప్రతిమా మోండల్, కీర్తి ఆజాద్, డాక్టర్ షర్మిలా సర్కార్ ఉన్నారు. ఢిల్లీ పోలీసుల చర్యపై స్పందిస్తూ, మొయిత్రా ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ఇలా రాశారు: “సిగ్గులేని అమిత్ షా, హోం మంత్రిత్వ శాఖ వద్ద మేము చేస్తున్న శాంతియుత నిరసన నుండి మమ్మల్ని లాక్కెళ్లడానికి ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నారు.”
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీనియర్ పోలీసు అధికారులు, ఇతరులపై సీబీఐ విచారణ కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్‌పై, దాని డైరెక్టర్‌పై తాము చేసిన దాడులను వీరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని ఈడీ ఆరోపించింది. ఈడీ తన రిట్ పిటిషన్లో, ‘ఐ-ప్యాక్ ప్రాంగణం నుంచి తాము స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ రికార్డులు, స్టోరేజ్ మీడియా, ఇతర పత్రాలను పోలీసులు చట్ట విరుద్ధంగా, బలవంతంగా తీసుకెళ్లారు’ అని ఆరోపించింది.
‘వాటిని తక్షణమే స్వాధీనం చేసుకుని, సీల్ చేసి, ఫోరెన్సిక్ భద్రత కల్పించి, తిరిగి ఈడీ కస్టడీకి అప్పగించాలని’ కోరింది. “దర్యాప్తులో లభించిన పక్కా ఆధారాల ప్రకారం, కనీసం రూ.20 కోట్లు అక్రమ నగదు చలామణి ద్వారా ఐ-ప్యాక్‌కు బదిలీ అయ్యాయి. అందుకే దీనిపై దర్యాప్తు ప్రారంభించాం. నిధుల మూలాలను గుర్తించేందుకు ఐ-ప్యాక్, బొగ్గు స్మగ్లింగ్ కేసుతో సంబంధం ఉన్న ఇతర సంస్థలపై సోదాలు ప్రారంభించాం” అని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది.
మరోవైపు, ఐ-ప్యాక్ దాడుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న పత్రాల దుర్వినియోగం కాకుండా ఈడీని నియంత్రించాలని టీఎంసీ శుక్రవారం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. రానున్న ఎన్నికల కోసం టీఎంసీ సిద్ధం చేసుకున్న రహస్య రాజకీయ, ప్రచార వ్యూహాలు, అంతర్గత అంచనాలు, పరిశోధన్ ఇన్పుట్లు, ఓటర్ల జాబితాకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుందని టీఎంసీ ఆరోపించింది.
‘ఇది ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా, అధికార దుర్వినియోగం చేయడమే’నని పేర్కొంది. ఈ పత్రాలకు, మనీలాండరింగ్ కేసుతో ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేదని టీఎంసీ తన పిటిషన్లో తెలిపింది. ఈడీ దర్యాప్తు ముసుగులో తమ పార్టీకి చెందిన రహస్యాలను చట్టవిరుద్ధంగా చూడడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడమేనని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.

More Stories
సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక
ఇరాన్ రేవులో చిక్కుకున్న రూ. 2,000 కోట్ల భారత బాస్మతి బియ్యం
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులంటే రక్తపాతమే!