లాలూ కుటుంబంపై నేరాభియోగాలు న‌మోదు

లాలూ కుటుంబంపై నేరాభియోగాలు న‌మోదు
ల్యాండ్ ఫ‌ర్ జాబ్ కేసులో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుటుంబంపై ఢిల్లీ కోర్టు అభియోగాలు న‌మోదు చేసింది. లాలూ కుటుంబం అవినీతికి పాల్ప‌డింద‌ని, నేర‌పూరిత కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు కోర్టు ఆరోపించింది. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, ర‌బ్రీ దేవి, తేజ‌స్వి యాద‌వ్‌, తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్‌ల‌ను ఆ కేసులో చేర్చారు.  అవినీతి చ‌ట్టంతో పాటు ఐపీసీ సెక్ష‌న్ల కింద నేరాభియోగాలు న‌మోదు చేశారు. రౌజ్ అవెన్యూ కోర్టు స్పెష‌ల్ జ‌డ్జీ విశాల్ గోగ్నే ఈ ఆదేశాలు జారీ చేశారు.
లాలూ యాద‌వ్‌పై అవినీతి అభియోగం న‌మోదు కాగా, ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌పై చీటింగ్, క్రిమిన‌ల్ కుట్ర కింద నేరాభియోగం న‌మోదు చేశారు.  రైల్వేశాఖ మంత్రిగా లాలూ యాద‌వ్ ఉన్న స‌మ‌యంలో భూములు తీసుకుని గ్రూపు డీ ఉద్యోగులు క‌ల్పించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌క్కువ ధ‌ర‌కే భూమిని అమ్మిన‌వాళ్ల‌కు రైల్వే ఉద్యోగాలు క‌ల్పించిన‌ట్లు కేసు నమోదయింది. 2004 నుంచి 2009 మ‌ధ్య ఈ నేరాలు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఉద్యోగ నియామ‌క స‌మ‌యంలో ఎటువంటి రిక్రూట్మెంట్ విధానాన్ని పాటించ‌లేదు. క్విడ్ ప్రోకో కింద ఉద్యోగులు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను యాద‌వ్ కుటుంబం ఖండించింది. రాజ‌కీయ కుట్ర‌తో త‌మపై ఆరోప‌ణ‌లు చేస్తున్నట్లు యాద‌వ్ ఫ్యామిలీ తెలిపింది. ఈ కేసుతో లింకున్న మ‌నీల్యాండ‌రింగ్ కోణంలో ఈడీ ద‌ర్యాప్తు చేప‌డుతున్నది. రూ. 600 కోట్ల ఆస్తులను ఇప్ప‌టికే సీజ్ చేసి అటాచ్ చేశారు.

ఓ క్రిమిన‌ల్ కంపెనీ త‌ర‌హాలో లాలూ యాద‌వ్ కుటుంబం ప‌నిచేసినట్లు జ‌డ్జీ గోగ్నే తెలిపారు. ఉద్యోగ క‌ల్ప‌న ప్ర‌క్రియ‌ను ఆస్తులు కూడ‌బెట్టుకునే విధానంగా మార్చుకున్న‌ట్లు లాలా కుటుంబంపై ఆరోప‌ణ చేశారు.  రైల్వే శాఖ‌ను వ్య‌క్తిగ‌త సొత్తుగా లాలూ వాడుకున్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. ఈ కేసులో 98 మంది నిందితులుగా ఉన్నార‌ని, దాంట్లో 46 మందిపై నేరాభియోగాలు న‌మోదు చేస్తున్నామ‌ని, మ‌రో 52 మందిని కేసు నుంచి డిశ్చార్జీ చేస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది.

గతంలో, సీబీఐ ఈ కేసులోని నిందితుల స్థితికి సంబంధించి ఒక ధృవీకరణ నివేదికను సమర్పించింది. దాని ఛార్జిషీట్‌లో పేర్కొన్న 103 మంది నిందితులలో ఐదుగురు మరణించారని అందులో పేర్కొంది. ఈ కేసులో అధికారికంగా అభియోగాలను నమోదు చేయడం కోసం కోర్టు ఈ విషయాన్ని జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ విషయమై వివరణాత్మక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.