అమెరికాలో కొకైన్ తో పట్టుబడ్డ ఇద్దరు భారత డ్రైవర్లు

అమెరికాలో కొకైన్ తో పట్టుబడ్డ ఇద్దరు భారత డ్రైవర్లు

అమెరికాలో ఇద్దరు భారత ట్రక్ డ్రైవర్లు భారీ కొకైన్ తో పట్టుబడ్డారు. ఆ కొకైన్ విలువ మన కరెన్సీలో దాదాపు రూ.62 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇండియానా పరిధిలో హైవేపై పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఇద్దరు భారత డ్రైవర్లు ట్రక్కులో తరలిస్తున్న కొకైన్ ను పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అయితే, తమ ట్రక్కులో కొకైన్ ఉందనే విషయం తెలియదని నిందితులు చెబుతున్నారు.

పట్టుబడ్డ డ్రైవర్లను గుర్ ప్రీత్ సింగ్ (25), జస్వీర్ సింగ్ (30)గా గుర్తించారు. అమెరికన్ మీడియా కథనం ప్రకార నిందితులు ఇద్దరూ ట్రక్కులో రిచ్ మండ్ వెళ్తుండగా ఇండియానా పోలీసులు హైవేపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ ట్రక్కులో డ్రగ్స్ ఉన్న విషయాన్ని శునకాలు పసిగట్టాయి.  దీంతో అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేయగా  డ్రైవర్ల స్లీపర్ బెర్త్ కింద పదుల సంఖ్యలో కార్డ్ బోర్డ్ బాక్సుల్ని గుర్తించారు. వాటిని తెరిచి చూడగా అందులో నిషేధిత కొకైన లభించింది. ఇది మొత్తం 309 పౌండ్లుగా ఉంది.

దీని విలువ మన కరెన్సీలో దాదాపు రూ.62 కోట్లుపైగానే ఉంటుంది. ఈ కొకైన్ తో 1,13,000 మందిని చంపొచ్చని పోలీసులు అంటున్నారు. దీనిపై నిందితులు మాట్లాడుతూ తమకు అందులో డ్రగ్స్ ఉన్న విషయం తెలియదని చెప్పారు. రిచ్మండ్లోని ఒక ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లాల్సిందిగా యజమానులు సూచించారని, అక్కడ లోడ్ చేస్తారని చెప్పారని, దీంతో తాము ట్రక్కు తీసుకుని బయల్దేరామని తెలిపారు. 

డ్రగ్స్ తో తమకేం సంబంధం లేదని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు కాలిఫోర్నియా నుంచి వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ లు పొందారని పేర్కొంత్ గుర్ ప్రీత్ 2023లో యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.  తాను భారతీయుడినని, అక్రమంగా యూఎస్ లో ఉంటున్నానని గుర్ ప్రీత్ అంగీకరించినట్లు చెప్పారు. ఇక జస్వీర్ సింగ్ కూడా 2017లో అక్రమంగానే అమెరికాకు వచ్చినట్లు గుర్తించామని, వీరి నుంచి ఇంకా పూర్తి సమాచారాన్ని రాబడుతున్నట్లు అధికారులు తెలిపారు.