వీసాలపై భారతీయ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక

వీసాలపై భారతీయ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక
అమెరికాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అరెస్టు అయినా వెంటనే భారత్‌కు తిరిగి పంపిస్తామని భారతీయ విద్యార్థులకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. అలాంటి విద్యార్థుల వీసాలను రద్దు చేస్తామని చెబుతూ చట్ట వ్యతిరేక ప్రవర్తనా శైలిని కలిగిన విద్యార్థులకు భవిష్యత్తులోనూ అమెరికా వీసాలు దొరకవని స్పష్టం చేసింది. 
 
అమెరికా వీసా అనేది ఒక ప్రయోజనమే తప్ప, హక్కు కాదని అమెరికా రాయబార కార్యాలయం తేల్చి చెప్పింది. అమెరికా చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే విద్యార్థులు తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈమేరకు సందేశంతో ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేసింది.  హెచ్-1బీ, హెచ్-4 వర్క్ వీసాలపై గతవారం కూడా భారత్‌లోని అమెరికా ఎంబసీ కీలక హెచ్చరిక చేసింది. 
 
వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఆన్‌లైన్ కార్యకలాపాలను డిసెంబరు 15 నుంచి తాము ముమ్మరంగా తనిఖీ చేస్తున్నామని వెల్లడించింది. ఈనేపథ్యంలో అభ్యర్థులకు వీసా ఇంటర్వ్యూల నిర్వహణలో జాప్యం జరుగుతుందని తెలిపింది. అమెరికా వలస చట్టాలను ఉల్లంఘించే వారిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చింది. అలాంటి వారికి అమెరికాలోకి అడుగుపెట్టే అవకాశం దొరకదని పేర్కొంది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా సర్కారు అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నది. ఈక్రమంలోనే ప్రభుత్వ వలస విధానాలను కఠినతరం చేస్తోంది. భారతీయ టెక్ నిపుణులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అమెరికా గడ్డపైకి అడుగు పెట్టేందుకు అత్యంత ముఖ్యమైన హెచ్-1బీ వీసా ఫీజును అమాంతం రూ.89 లక్షలకు ట్రంప్ పెంచారు. 
2025 సెప్టెంబరు 21 తర్వాత హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసిన వారంతా ఈ ఫీజును కట్టాల్సి ఉంటుంది. 
 
విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండాల్సిన వ్యవధిపై పరిమితిని విధించాలనే ప్రతిపాదన కూడా ట్రంప్ సర్కారు పరిశీలనలో ఉంది. ఈ అంశాలు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాలి అనుకునే భారతీయ విద్యార్థులను పునరాలోచనలో పడేస్తున్నాయి. కొందరు అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లోని యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల వైపు చూస్తున్నారు.