సుంకాలు పెంచుతానని ట్రంప్ మరోసారి హెచ్చరిక!

సుంకాలు పెంచుతానని ట్రంప్ మరోసారి హెచ్చరిక!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి అని పొగుడ్తూనే తనకు నచ్చినట్లుగా చేయకపోతే మరోసారి సుంకాలు పెంచుతానని హెచ్చరించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో విషయంలో చేపట్టబోయే చర్యల గురించి చెబుతున్న వేళ ట్రంప్ భారత్ గురించి కూడా ప్రస్తావించారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించిందని, తనను సంతోషపెట్టేందుకే భారత ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

వాళ్లు నన్ను సంతోషపెట్టాలని భావించారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. రష్యాతో వారు వ్యాపారం కొనసాగిస్తేం.. మనం చాలా వేగంగా టారిఫ్‌లు పెంచుతాం అని ట్రంప్ హెచ్చరించారు.  దీనికి సంబంధించిన ఒక ఆడియా క్లిప్‌ను వైట్ హౌస్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో వెల్లడించింది. భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ వాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

ఇటీవల అమెరికా వెనెజువెలాలో చేపట్టిన సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి.  అయితే గతంలోనూ రష్యా చమురు కొనుగోళ్లను తగ్గిస్తామని ప్రధాని మోదీ తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ సమర్థించుకుంటూ వస్తోంది. దేశీయ ఇంధన అవసరాల దృష్ట్యా తక్కువ ధరకు లభిస్తున్న చమురును కొనుగోలు చేయడం తప్పనిసరి అని న్యూఢిల్లీ స్పష్టం చేస్తోంది. 

ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత రష్యా చమురుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో, భారత్‌ రాయితీ ధరలకు చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే దీనిపై వాషింగ్టన్‌లో అసంతృప్తి పెరుగుతోంది. భారత్‌ రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం అమెరికా ఆంక్షల ప్రభావాన్ని తగ్గిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగింది.

ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో వేగం కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు. అదే సమయంలో భారత్‌- అమెరికా అధికారుల మధ్య తాజా వాణిజ్య చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ చర్చల ఉద్దేశం, సుంకాలకు సంబంధించిన దీర్ఘకాల వివాదాలకు పరిష్కారం కనుగొనడమే. అయితే ఈ చర్చలకు ముందు రోజులలోనే ట్రంప్‌ భారత్‌ నుంచి బియ్యం దిగుమతులపై కొత్త టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించడం గమనార్హం.

వాణిజ్య చర్చలు ఒకవైపు సాగుతున్నప్పటికీ, మరోవైపు ట్రంప్‌ నుంచి వస్తున్న టారిఫ్‌ హెచ్చరికలు ఇరు దేశాల మధ్య కొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.