ఫోన్ ట్యాపింగ్ లో బిఆర్ఎస్​ ఎమ్మెల్సీ నవీన్‌ రావు విచారణ

ఫోన్ ట్యాపింగ్ లో బిఆర్ఎస్​ ఎమ్మెల్సీ నవీన్‌ రావు విచారణ
* త్వరలో హరీష్ రావుకు నోటీసులు?

ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ నవీన్‌ రావును సిట్‌ సుదీర్ఘంగా ప్రశ్నించింది. గులాబీ పార్టీ పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాలపైనా ఆరా తీసింది. దాదాపు 9 గంటల పాటు సాగిన విచారణలో నవీన్‌ రావు సమాచారం ఆధారంగా మరికొందరు కీలక నేతలను విచారించనున్నారు. ఫోన్‌ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ముఖ్య నేతలు తెరపైకి వస్తున్నారు.

ఇప్పటి వరకు పోలీస్ అధికారులు, ప్రైవేటు వ్యక్తుల చుట్టే తిరిగిన దర్యాప్తు, తాజాగా ప్రజాప్రతినిధుల వైపు మళ్లింది. బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ నవీన్ రావును ఆదివారం ఉదయం 11 గంటలకు సిట్‌ కార్యాలయానికి వచ్చిన నవీన్‌ రావును, రాత్రి 8 గంటల వరకు విచారించారు. సిట్ సభ్యులు మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులతో కూడిన బృందం నవీన్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 

గత ప్రభుత్వంలో ఎస్.ఐ.బిలో పని చేసిన ప్రభాకర్‌రావు బృందంతో ఉన్న సంబంధాలపైనా సిట్‌ ఆరా తీసింది.  ముఖ్యంగా గులాబీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు సమకూరిన విషయంలో నవీన్‌ పాత్ర ఏంటనే కోణంలో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సొమ్ముతో ఫోన్ అక్రమ ట్యాపింగ్‌కు సంబంధముందా? అని ఆరా తీసినట్లు సమాచారం.  వాస్తవానికి హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న క్రమంలోనే నవీన్‌ రావు పేరు తెరపైకి వచ్చింది. 

ఆయనకు నోటీస్ ఇచ్చి 2024 సెప్టెంబర్ 24న వాంగ్మూలం నమోదు చేశారు. తాజాగా మరోసారి ఆయన్ని విచారించడం ప్రాధాన్యం సంతరించుకొంది.  గతంలో అడిగిన విషయాలనే మరోసారి సిట్‌ అధికారులు అడిగారని ఎమ్మెల్సీ నవీన్‌ రావు తెలిపారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు తానే ట్యాపింగ్ పరికరాలను సమకూర్చాననే విషయంలో ఎలాంటి ప్రశ్నలు అడగలేదని, అలాంటి ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు తదనంతరం మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఏ టి. హరీష్ రావుకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన ఫోన్ ట్యాప్ చేశారని ఇదివరకే సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ సిట్‌కు ఫిర్యాదు చేయగా, తనపై సిట్ నమోదు చేసిన కేసుపై హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించగా కొట్టివేసింది. 
 
అయితే కొట్టివేతను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది. ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలపై హరీష్‌రావుకు నోటీసులు ఇచ్చే అంశం ఆధారపడి ఉంది.