పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపడుతున్న విచారణలో దిగ్భ్రాంతి కలిగించే నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ ఉగ్రకుట్రలో ప్రధాన నిందితులుగా ఉన్న కొందరు డాక్టర్లు, తమ కార్యకలాపాలు గుట్టుగా కొనసాగించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. ‘ఘోస్ట్ సిమ్’ కార్డులు, హై లెవల్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో నిరంతర సంప్రదింపులు కొనసాగించినట్లు తేలింది.
సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో పాటు ఇతర నిందితులు పోలీసుల కంటపడకుండా ఉండేందుకు ఒకేసారి రెండు నుంచి మూడు మొబైల్ ఫోన్లను ఉపయోగించేవారు. నకిలీ ఆధార్ కార్డులు లేదా ఇతరుల గుర్తింపు పత్రాలతో తీసుకున్న సిమ్ కార్డులను వాడుతూ, తమ అసలు గుర్తింపును దాచిపెట్టే ప్రయత్నం చేశారు. విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది.
నిందితులు ఉపయోగించిన కొన్ని మెసేజింగ్ యాప్‌లకు సిమ్ కార్డు అవసరం లేకుండా, కేవలం వై-ఫై ద్వారా సందేశాలు పంపే అవకాశం ఉంది. ఈ రహస్య యాప్‌ల ద్వారానే పాకిస్థాన్ హ్యాండ్లర్ల నుంచి పేలుడు పదార్థాల తయారీపై శిక్షణ పొందినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. ఈ విధానం వల్ల నిఘా వ్యవస్థలను తప్పించుకోవడం వీరికి సులభమైంది. ఇతరుల గుర్తింపు కార్డులు దొంగిలించి లేదా నకిలీ పత్రాలతో తీసుకునే సిమ్ కార్డులను ‘ఘోస్ట్ సిమ్స్’గా పిలుస్తారు.
నేరం జరిగిన తర్వాత ఆ నంబర్‌ను ట్రేస్ చేస్తే, అసలు నిందితుడికి సంబంధం లేని వ్యక్తి వివరాలు బయటపడేలా చేయడం వీటి ఉద్దేశ్యం. ఉగ్రవాదులు, సైబర్ నేరగాళ్లు విచారణను తప్పుదారి పట్టించేందుకు ఈ వ్యూహాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలాంటి ఉగ్ర నెట్‌వర్క్‌లను అడ్డుకునేందుకు కేంద్ర టెలికం శాఖ గత ఏడాది నవంబర్‌లో కీలక నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
- సిమ్ ఉన్నప్పుడే యాప్ పనిచేయాలి: ఏ సిమ్‌తో అకౌంట్ రిజిస్టర్ అయిందో, ఆ సిమ్ ఫోన్‌లో ఉంటేనే మెసేజింగ్ యాప్ యాక్టివ్‌గా ఉంటుంది.
- ఆటోమేటిక్ లాగౌట్ విధానం: సిమ్ తొలగించినా లేదా ఫోన్ మార్చినా, యాప్ స్వయంచాలకంగా లాగౌట్ అవుతుంది. దీంతో సిమ్ లేకుండా ఇంటర్నెట్ ద్వారా మెసేజింగ్ చేసే అవకాశం ఉండదు.
ప్రస్తుతం ఎన్ఐఏ నిందితుల డిజిటల్ డేటాను లోతుగా విశ్లేషిస్తూ, ఈ ఉగ్రకుట్రలో మరెవరెవరు పాత్రధారులున్నారనే దానిపై విచారణ కొనసాగిస్తోంది.

More Stories
ఢిల్లీ మసీదు వద్ద రాళ్లతో దాడి.. ఐదుగురు పోలీసులకు గాయాలు
వైష్ణోదేవి సంస్థ మెడికల్ సీట్ల అనుమతి రద్దు!
31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు