హైదరాబాద్​లో దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత

హైదరాబాద్​లో దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత

గాలిలో నాణ్యత పడిపోవడంలో హైదరాబాద్‌ నగరం దేశ రాజధాని డిల్లీతో పోటీ పడుతోంది. కొత్త ఏడాది తొలి రోజున పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 వరకు చేరుకుంది. ఇది థర్డ్‌ పార్టీ, గూగుల్‌ యాప్‌లు, పరికరాల ద్వారా నమోదవుతున్న సూచీల ప్రకారం లెక్క. కానీ సీపీసీబీ ఏర్పాటు చేసిన సూచీలలో మాత్రం కొత్త ఏడాది గరిష్ఠంగా 170 వరకే నమోదు కావడం గమనార్హం. 

సీపీసీబీ సూచించే కొలతల్లో కచ్చితత్వం లేదని కొందరు విశ్రాంత ప్రొఫెసర్లు చెబుతున్నారు. హైదరాబాద్​ నగరంలోని 14 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి ఏక్యూఐ పరికరాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పీసీబీ గరిష్ఠ, కనిష్ఠ సూచీలను వెల్లడిస్తోంది. ఏక్యూఐ 100 దాటితే ముప్పు పొంచి ఉన్నట్లే అని చెబుతోంది.  డిసెంబరులో హైదరాబాద్‌లో గరిష్ఠంగా పీసీబీ లెక్కల ప్రకారం ఏక్యూఐ 132 మాత్రమే ఉంది. థర్డ్‌ పార్టీ యాప్‌లలో నమోదైన ఏక్యూఐ 270 వరకు ఉండటం గమనార్హం.

ఇంత వ్యత్యాసం ఉండకూడదని ఒక పక్క శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలి నాణ్యతను యురోపియన్‌ ప్రమాణాల మేరకు కొలిచే మెషిన్ల ధర ఒక్కొక్కటి దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుంది. పీసీబీ వాడుతున్న పరికరాలు ఆ స్థాయిలో పని చేయలేవని పరిశోధకులు చెబుతున్నారు.  గాలిలో కాలుష్యాన్ని బయో, ఫిజికల్, కెమికల్‌ రియాక్టివ్‌లని మూడు రకాలుగా పరిగణనలోకి తీసుకుని నాణ్యతను కొలుస్తారు.

గాలిలో తేమ, బ్యాక్టీరియా, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వ్యర్థాల వాసనలన్నీ మొదటి రకంలోకే వస్తాయి. సూక్ష్మ ధూళి కణాలను రెండో రకంలోకి తీసుకుంటారు.  రసాయన ప్రభావం కల్గించే కార్బన్‌ డయాక్సైడ్, సల్ఫర్, మిథనాల్, నైట్రోజన్‌ ఆక్సైడ్, బెంజిన్‌ తదితరాలను కెమికల్‌ రియాక్టివ్‌లో తీసుకుంటారు. ఇవన్నీ ప్రమాణాలను దాటితే ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్‌ వంటివి సోకే ప్రమాదం ఉంటుంది.

హైదరాబాద్‌లో దాదాపు 80 లక్షల వాహనాలుంటే రోజూ సగటున 50 లక్షల వరకు రోడ్డు మీదకు వస్తున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ గాలి నాణ్యతను తీవ్ర ప్రభావితం చేస్తోంది. వీటితో పాటు భవన నిర్మాణాలు, చెత్తాచెదారం, మురుగు, పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలు వాయు నాణ్యతను మరింత క్షీణింపచేస్తున్నాయి.

గాలి నాణ్యత 100 దాటితేనే చాలా ప్రమాదకరం. ఒకవేళ 300లకు చేరితే ఆ గాలి పీల్చిన వారికి పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశముంది. దాన్ని పీలిస్తే రోజుకు 30 నుంచి 35 సిగరెట్లు కాల్చిన దానితో సమానమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గాలి నాణ్యతను సీపీసీబీ నమోదు చేస్తున్నా, ఎక్కడా కచ్చితమైన లెక్కలు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. థర్డ్‌ పార్టీ, గూగుల్‌ యాప్, సీపీసీబీ ప్రకటిస్తున్న సూచీలకు చాలా వ్యత్యాసం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.