* వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
అమెరికా చర్య అంతర్జాతీయ చట్టాలు, ప్రాథమిక నిబంధనలను, ఐరాస చార్టర్ సూత్రాల్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. లాటిన్ అమెరికా, కరేబియన్ లలో శాంతి, భద్రతలకు ముప్పు కలిగించే అమెరికా ఆధిపత్య ప్రవర్తనను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని పేర్కొంది. అమెరికా నిర్ణయాన్ని ప్రమాదకర ఉదాహరణగా అభివర్ణించిన ఐరాస సోమవారం భద్రతా మండలి సమావేశం కావాలని కోరింది.
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంతో ఆ దేశ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. వెనెజువెలా రక్షణ కోసం డెల్సీ రోడ్రిగ్జ్ ఈ పదవి చేపట్టాలని పేర్కొంది. వెనెజువెలాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకుముందు ప్రకటన చేశారు. అధికార బదిలీ జరిగే వరకూ వెనెజువెలాను నడిపిస్తామన్నారు.
ఈ నేపథ్యంలోనే వెనెజువెలా సుప్రీంకోర్టు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా డెల్సీ రోడ్రిగ్స్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మద్దతిస్తున్నట్లు సమాచారం. వెనెజువెలాను మళ్లీ గొప్పగా మార్చడానికి ఏమి అవసరమని తాము భావిస్తున్నామో, ఆ పనులు చేయడానికే డెల్సీ సానుకూలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 56 ఏళ్ల డెల్సీ రోడ్రిగ్జ్, నికోలస్ మదురోకు అత్యంత సన్నిహితురాలు. 1969లో కారకాస్‌లో జన్మించిన ఈమె, విప్లవ నేత జార్జ్ ఆంటోనియో రోడ్రిగ్జ్ కుమార్తె. వృత్తిరీత్యా న్యాయవాది అయిన డెల్సీ, గత దశాబ్ద కాలంలో వెనిజులా రాజకీయాల్లో కీలక మహిళా నేతగా పేరొందారు. దురో ప్రభుత్వంలో కమ్యూనికేషన్, విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించిన డెల్సీ, 2018లో ఉపాధ్యక్షురాలిగా నియామకం అయ్యారు.

More Stories
ఉమర్ ఖలీద్ కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య
పెట్రో డాలర్ల కోసమే ట్రంప్ బందీగా వెనెజువెలా అధ్యక్షుడు!