అమెరికా బందీగా వెనెజువెలా అధ్యక్షుడు!

అమెరికా బందీగా వెనెజువెలా అధ్యక్షుడు!
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ప్రయాణిస్తున్న విమానం శనివారం (స్థానిక సమయం) న్యూయార్క్‌లోని స్టీవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌లో ల్యాండ్ అయింది, వెనిజులాలోని కారకాస్‌లో జరిగిన పెద్ద ఎత్తున అమెరికా సైనిక దాడిలో వారు పట్టుబడ్డారు. నిఘా సంస్థలు, అమెరికా చట్ట అమలు సంస్థలు పాల్గొన్న ఉమ్మడి ఆపరేషన్‌లో దేశం నుండి బయటకు వెళ్లారు. 
 
ఇవే ఆరోపణలపై 1989లో పనామాపై దాడి చేసి ఆ దేశ సైనిక పాలకుడు మాన్యుయెల్‌ నొరీగాను పదవీచ్యుతిడిని చేసిన నాటి నుంచి లాటిన్‌ అమెరికాలో నేరుగా అమెరికా జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి.  వెనెజువెలా అధ్యక్షుడు అధ్యక్షుడు నికోలస్ మదురోపై నార్కో-టెర్రరిజం కేసు పెట్టినట్లు యూఎస్​ అటార్నీ జనరల్​ పమేలా బోండి శనివారం ప్రకటించారు. ఆయనపై అమెరికా చట్టాల ప్రకారం విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.
 
“నికోలస్​ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్​పై న్యూయార్క్​లోని సౌత్రన్ డిస్ట్రిక్ట్​లో కేసు నమోదు అయ్యింది. మదురోపై నార్కో-టెర్రరిజం, కొకైన్ ఇంపోర్టేషన్ కుట్ర కేసులు​, అమెరికాకు వ్యతిరేకంగా మెషిన్​గన్​లు, విధ్వంసక పరికరాలను కలిగి ఉండడం మొదలైన అభియోగాలు మోపడం జరిగింది. త్వరలోనే వారిపై అమెరికా కోర్టుల్లో, అమెరికా చట్టాల ప్రకారం విచారణ జరుగుతుంది” అని వెల్లడించారు.

కాగా, శాంతి, న్యాయం, సురక్షిత అధికార మార్పు జరిగే వరకు తాత్కాలికంగా వెనెజువెలాను అమెరికానే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘ దేశం సురక్షితమని భావించే వరకూ, సరైన, న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకూ మా పాలనే కొనసాగుతుంది. వెనెజువెలా ప్రజలకు శాంతి, న్యాయం, స్వేచ్ఛ కావాలి. వేరెవరో అధికారం చేపట్టి ప్రజల శ్రేయస్సును పట్టించుకోకపోతే, అలా జరగనివ్వం. ప్రస్తుతం మేం అక్కడే ఉన్నాం. సరైన మార్పు జరిగే వరకు అక్కడే కొనసాగుతాం. అసలు ఆ దశ వచ్చే వరకు దేశాన్ని మేమే నడిపిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు.

వెనెజువెలాలో దెబ్బతిన్న చమురు మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు అమెరికా చమురు కంపెనీలు బిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫ్లోరిడాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా ప్రస్తుతం చమురు విక్రయ వ్యాపారంలోనే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. చమురు కొనుగోలు చేయాలనుకునే ఇతర దేశాలకు అమెరికా చమురును సరఫరా చేస్తుందని తెలిపారు.

కాగా, వెనెజువెలా అధ్యక్షుడు, అతని భార్యను అమెరికా దాడి చేసి బందీగా తీసుకెళ్లడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా ప్రకటించింది. ఇదే నిజమైతే, స్వతంత్ర దేశమైన వెనెజువెలా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఇది అంతర్జాతీయ ప్రాథమిక సూత్రాల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేసింది.  ఓ దేశాధ్యక్షుడిని బలవంతంగా తీసుకెళ్లడం పట్ల తాము చాలా ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. అమెరికా శనివారం వెనెజువెలాపై చేసిన దాడిని ‘సాయుధ దురాక్రమణ’గా రష్యా వ్యాఖ్యానించింది. తమ చర్యలను సమర్థించుకోవడానికి అమెరికా చెబుతున్న సాకులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా సైన్యం బంధించడం అనేది యుద్ధ చర్య అని న్యూయార్క్ నగర మేయర్ జొహ్రాన్ మమ్దానీ విమర్శించారు. నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసి ఈవిషయాన్ని తాను సూటిగా చెప్పానని ఆయన వెల్లడించారు. అయితే, దీనికి ట్రంప్ ఎలా స్పందించారు అనేది మీడియాకు మమ్దానీ తెలియజేయలేదు.

అమెరికా కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండా వెనెజువెలాపై ట్రంప్ సర్కారు సైనిక చర్య చేపట్టడం సరికాదని అమెరికా ప్రతినిధుల సభ ఇంటెలీజెన్స్ కమిటీ సీనియర్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి విమర్శించారు. మరొక సార్వభౌమ దేశంపై అమెరికా నియంత్రణ గురించి బహిరంగంగా ట్రంప్ మాట్లాడటం కూడా చట్టవ్యతిరేకమే అని ఆయన తెలిపారు. దేశ అధ్యక్ష అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేస్తున్నారని రాజా కృష్ణమూర్తి పేర్కొన్నారు. 

 
అమెరికా రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజన సూత్రాన్ని ట్రంప్ విస్మరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వెనెజువెలాకు పంపిన అమెరికా సైనికుల భద్రత గురించి వెంటనే దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని ట్రంప్‌ను ఆయన డిమాండ్ చేశారు. అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు పెరిగి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడటంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు “ప్రమాదకరమైన ఉదాహరణ” అని పేర్కొన్నారు.