ముప్పులో ‘మూడో వంతు’ ఆరావళి

ముప్పులో ‘మూడో వంతు’ ఆరావళి
ఆరావళి పర్వత శ్రేణిలో మూడవ వంతు పర్యావరణ ముప్పును ఎదుర్కొంటున్నదని ఓ స్వతంత్ర సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆరావళి పర్వత పరిక్షణ సమితి ‘వీ ఆర్‌ ఆరావళి’ ఇందుకు సంబంధించి శాటిలైట్‌ డాటాను శనివారం విడుదల చేసింది. మైనింగ్‌తో ఇప్పటివరకు 0.19 శాతమే దెబ్బ తిన్నదంటూ కేంద్రం చేస్తున్న వాదనను తోసిపుచ్చింది.  శాటిలైట్​ డేటా ఆధారంగా చేసిన ఆడిట్​లో ఆరావళి శ్రేణిలో దాదాపు 31.8 శాతం ప్రాంతం (1/3వ వంతు భాగం) పర్యావరణ పరంగా అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని పేర్కొంది.
ఆరావళి ప్రాంతంలో మైనింగ్‌ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది.  ‘100 మీటర్ల ఎత్తు’ అనే విధానంతో ఆరావళి పర్వత శ్రేణిలో 31.8 శాతం ప్రభావితమైందని, 0.19 శాతమే నంటూ కేంద్రం చెబుతున్నదానికి క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని తెలిపింది. పర్యావరణవేత్త, డాక్టర్‌ సుధాన్షు మాట్లాడుతూ, ‘తక్కువ ఎత్తులో ఉన్న కొండలను బంజరు భూములుగా తప్పుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు.

‘బ్రిస్టల్ ఎఫ్​ఏబీడీఈఎం మోడల్ ద్వారా నిర్వహించిన ఈ ఫోరెన్సిక్ విశ్లేషణలో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వర్గీకరణ ప్రకారం 100మీ కంటే తక్కువ ఎత్తుగల వాటిని ‘పర్వతాలు’గా గుర్తించడం లేదు. దీని వల్ల దాదాపపు 31.8 శాతం ఆరావళి ప్రాంతం చట్టపరమైన రక్షణను కోల్పోయింది. పైగా ప్రభుత్వం వీటిని కేవలం ‘బంజరు భూములు’గా పరిగణిస్తూ, మైనింగ్​కు అనుమతులు ఇస్తోంది’ అని డాక్టర్ సుధాంశు తెలిపేరు.

వాస్తవానికి తక్కువ ఎత్తులో ఉండే కొండలే భూగర్భ జలాల పునరుద్ధరణకు (గ్రౌండ్ వాటర్ రీఛార్జ్​)కు కీలకం. ఒక వేళ ఆరావళి శ్రేణిలోని 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు గల కొండలను తొలగిస్తే, జైపుర్​, గురుగ్రామ్​ లాంటి నగరాలు నీరు లేక కరవుతో అలమటించాల్సి వస్తుంది. అంతేకాదు రాజస్థాన్, హరియాణా, డిల్లీల్లో నీటి భద్రత, గాలి నాణ్యత ఉండకుండా పోతుంది.

వాస్తవానికి థార్ ఎడారి విస్తరించకుండా ఈ ఆరావళి కొండలే సహజ అడ్డుగోడలుగా పనిచేస్తున్నాయి. వీటిని కనుక తొలగిస్తే వాయువ్య భారత దేశం పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టే శక్తి ఈ సహజ పర్వత శ్రేణులకు ఉంది. కానీ వీటిని మైనింగ్ చేసి నాశనం చేస్తే, వాయు కాలుష్యం పెరిగి సుమారు 30 కోట్ల మంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ఆరావళి శ్రేణి మొత్తాన్ని ‘సంరక్షిత ప్రాంతం’గా ప్రకటించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఎత్తుతో సంబంధం లేకుండా కొండలు అన్నింటికీ రక్షణ కల్పించాలని చెబుతున్నారు. మైనింగ్ లీజులను రుద్దు చేసి, తక్షణమే మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని కోరుతున్నారు. చిత్తోర్​గఢ్​, నాగౌర్, బుందీ, సవాయ్​ మాధోపుర్​ మొదలైన ప్రాంతాలను కూడా ఆరావళి శ్రేణిలో చేర్చి, దెబ్బతిన్న కొండలను పునరుద్ధరించాలని చెబుతున్నారు.