కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్లారిలో హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడు సతీశ్‌రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే జనార్దన్‌రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గాలి జనార్దన్‌రెడ్డి, బళ్లారి రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బళ్లారిలోని ఎస్పీ సర్కిల్‌లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఈనెల 3న ఏర్పాటు చేయనున్నారు. నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం హవ్వబావి ప్రాంతంలోని జనార్దన్‌రెడ్డి ఇంటి ప్రహరీకి కూడా సతీశ్‌రెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు.
జనార్దన్‌రెడ్డి అనుచరులు అడ్డుచెప్పారు. ప్రహరీకి వద్దని, బయట కట్టుకోవాలని సూచించారు. సతీశ్‌రెడ్డి వినకుండా కుర్చీ తెప్పించుకుని జనార్దన్‌రెడ్డి ఇంటి ముందు కాలుమీద కాలు వేసుకుని కూర్చుని.. ‘ఇక్కడే ఫ్లెక్సీ కడతాను’ అని పట్టుబట్టాడు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. అదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్‌రెడ్డి బళ్లారి ఇంటికి వచ్చారు. ఆయన్ను చూసి సతీశ్‌రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టాడు.
ఫ్లెక్సీ కట్టేందుకు యత్నించడంతో జనార్దన్‌రెడ్డి అనుచరులు, సతీశ్‌రెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు ఇద్దరి గన్‌మెన్ గాలిలోకి కాల్పులు జరిపారు. సతీశ్‌రెడ్డి ఓ గన్‌మన్ వద్ద తుపాకీ లాక్కుని జనార్దన్‌రెడ్డి వైపు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు.
ఇదే సమయంలో ఇరువర్గాలూ కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్‌రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీశ్‌రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. విషయం తెలుసుకున్న గాలి సన్నిహితుడు, మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబు, గాలి సోమశేఖర్‌రెడ్డి, వారి అనుచరులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఇరు వర్గాలనూ పోలీసులు చెదరగొట్టారు.

More Stories
సానుకూల మార్పునకు కుత్రిమ మేధ పెద్ద అవకాశం
కేరళలో యుడిఎఫ్, ఎల్డిఎఫ్ ఫిక్స్డ్ మ్యాచ్ త్వరలో ముగింపు
వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్